Nagarjuna Sagar: ప్రసంగంలో బీజేపీని ప్రస్తావించని కేసీఆర్.. స్పీచ్‌లో అధికభాగం జానారెడ్డిపైనే..
Nagarjuna Sagar: థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే జానారెడ్డి, నాగార్జున సాగర్‌కు ఏం చేశారని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. కనీసం డిగ్రీ కాలేజీ తేలేకపోయారని విమర్శించారు గులాబీ బాస్.
Nagarjuna Sagar: థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే జానారెడ్డి, నాగార్జున సాగర్‌కు ఏం చేశారని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. కనీసం డిగ్రీ కాలేజీ తేలేకపోయారని విమర్శించారు గులాబీ బాస్. సాగర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా, హాలియాలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం, జానారెడ్డిపైనే విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. కేసీఆర్‌కు సీఎం పదవి, తాను పెట్టిన భిక్ష అంటున్న జానారెడ్డి, తాను ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారన్నారు. పదవులు కోసం, కాంగ్రెస్ నేతలు తెలంగాణను వదిలిపెట్టారన్న కేసీఆర్, తెలంగాణ కోసం పదవులను త్యాగం చేసింది టీఆర్ఎస్సేనన్నారు. ఆలోచన, పరిణతితో ఓటు వెయ్యాలని, ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దన్నారు. గాడిదలకు గడ్డేసి ఆవుకు పాలు పితికితే పాలు రావు.. ముండ్ల చెట్లు పెట్టి పండ్లు కాయమంటే కాయవు. పండ్ల చెట్లు పెడితేనే కాయలు కాస్తాయన్నారు కేసీఆర్. తన సభ జరగకుండా అనేక శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేశాయన్నారు.
మిత్రుడు నోముల నర్సింహయ్యను కోల్పోవడం బాధాకరమని చెప్పారు. వామపక్ష పార్టీల్లో ఉంటూ ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆయన తనయుడు, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను ఆశీర్వదించాలని కోరారు. నియోజకవర్గంలో భగత్ గాలి బాగానే ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ మొత్తం ప్రసంగంలో బీజేపీ మాటే ఎత్తలేదు. ఆ పార్టీ పేరే ప్రస్తావించలేదు. మొత్తం స్పీచ్‌లో జానారెడ్డి గురించే ఎక్కువగా మాట్లాడి, కాషాయ ఊసే ఎత్తకపోవడం చర్చనీయాంశమైంది. బీజేపీ పేరును కావాలనే ప్రస్తావించలేదా? సాగర్‌లో పోటీ కేవలం టీఆర్ఎస్-కాంగ్రెస్‌ల మధ్యే జరుగుతోందన్న సంకేతమిచ్చారా? అనవసరంగా బీజేపీ పేరెత్తి, దాన్ని హైలెట్ చెయ్యడం కేసీఆర్‌కు ఇష్టంలేదా? దుబ్బాక, గ్రేటర్ ఎలక్షన్స్ టైంలో అదే పనిగా కాషాయ నేతలను తూర్పారబట్టిన కేసీఆర్, ఇప్పుడెందుకు వారి ప్రస్తావన పక్కనపెట్టారన్నది ఆసక్తిగా మారింది.