BJP: తెలంగాణలో వలస నేతలకు బీజేపీ హైకమాండ్ పెద్దపీట
BJP: గత 15 రోజుల్లో ఇతర పార్టీల నుంచి 8మంది కీలక నేతలు చేరితే..
BJP: వలస వచ్చిన నేతలకే తెలంగాన బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందా..? టికెట్ల కేటాయింపుల్లో వలస నేతలకే పార్టీ పెద్దపీట వేసిందా..? ఇప్పటి వరుకు పార్టీలోకి వచ్చిన కొత్త నేతలు ఎందరు..? అందులో పార్లమెంట్ టికెట్లు దక్కించుకున్న నేతలందరూ..? ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలకే బీజేపీ ఎందుకు ప్రియార్టీ ఇస్తోంది..? ప్రస్తుతం పార్టీలో ఉన్న కమలనాథులు పోటీకి సరిపోరా.? టికెట్ల ప్రకటనతో హైకమాండ్ స్ట్రాటజీ పట్ల.. పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చి జరుగుతుంది..?
తెలంగాణలో పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించడంలో బీజేపీ ముందు వరుసలో ఉందనే చెప్పాలి. మొత్తం 17 స్థానాలకు గాను ఇప్పటికే 15స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా వరంగల్, ఖమ్మం రెండు పార్లమెంట్ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో బీజేపీ నుంచి గెలిచిన నలుగురు సిట్టింగ్‌లో... అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ నగేష్ కి సీటు కేటాయించింది. కమలం పార్టీలో సగానికి పైగా సీట్లు కొత్త ముఖాలకే దక్కాయి. మిగిలిన రెండు సీట్లు కూడా కొత్త వాళ్ళకే కేటాయించనున్నట్లు సమాచారం. కొత్తగా వచ్చిన నేతలకే పార్టీ అధిక ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుంది. పక్కాగా హ్యాట్రిక్ కొట్టాలని, 400సీట్లను టార్గెట్‌గా పెట్టుకున్న కమలనాథులు.. గెలుపునే ప్రాతిపదికగా తీసుకుని మిగతా అన్ని అంశాలను పక్కన బెట్టింది. ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలైనా గెలుపునే ప్రామాణికంగా తీసుకుని టికెట్లు కేటాయిస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారాయి. లోక్‌సభ ఎన్నికలు కావడంతో జాతీయ పార్టీలకు ప్రిపరెన్స్ ఇస్తున్నారు నేతలు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్‌ను వీడుతున్నారు ముఖ్యనేతలు. సిట్టింగ్ ఎంపీలు కూడా కమలతీర్థం పుచ్చుకుంటున్నారు. గత 15 రోజుల్లో 8మంది కీలక నేతలు..బీజేపీలో చేరగా..అందులో 7గురికి పార్టీ టికెట్ ఇచ్చింది. మరో ఇద్దరికి కూడా ఇచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిని పక్కన ఫెట్టి... కొత్త వారికే జై కొట్టింది. గెలుపే లక్ష్యంగా... సిద్ధాంతాలు, పార్టీ కోసమే పని చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే విధానాలను పక్కన పెట్టింది. గతంలో బీజేపీపై విమర్శలు చేసిన వారిని, కార్యకర్తలపై కేసులు పెట్టించిన వారికి సైతం టికెట్లు ప్రకటించింది. దీంతో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. చాలా కాలంగా కష్టపడుతున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే బాగుండేదని పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. మోడీ గాలి ఉన్న నేపథ్యం లో బిజెపికి బలమైన కేడర్ ఓటు బ్యాంక్ ఉన్న చోట అయిన పాత వారికి అవకాశం ఇస్తే బాగుండేదని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.
నాగర్ కర్నూల్ నుంచి భరత్, జహీరాబాద్ నుంచి బిబి పాటిల్, హైదరాబాద్ నుంచి మాధవిలత, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, సైదిరెడ్డికి నల్గొండ, సీతారాం నాయక్‌కు మహబూబాబాద్, నగేష్ కి అదిలాబాద్ ఎంపీ సీట్లు కేటాయించింది. ఇక ఖమ్మం నుండి జలగం వెంకట్ రావు పేరు దాదాపు ఖరారు అయినట్టేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. వరంగల్ నుండి ఆరూరి రమేష్ ను పార్టీ బరిలోకి దించనుంది. మొత్తం 9 మంది నిన్న మొన్న జాయిన్ అయిన వారికే పార్టీ టికెట్లు కేటాయించి పెద్దపీట వేసింది. సర్వేలను ఆధారంగా తీసుకొని గెలిచే అవకాశం ఉన్న నేతలకే టికెట్లు కేటాయించినట్లు పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఐతే ఇతర పార్టీల నుండి బిజెపిలోకి వచ్చిన నేతలకు మొదటి నుండి పార్టీలో ఉన్న నేతలు ఎంతవరకు సహకరిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.