వానరాల వరుస దాడులు..టెన్షన్ లో ప్రజలు

కరీంనగర్‌ జిల్లాలో శంకరపట్నం మండలంలోని గ్రామాలపై కోతులు దండయాత్ర చేస్తున్నాయి. వందల సంఖ్యలో కదిలివచ్చి ఆ గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Update: 2021-01-18 07:06 GMT

People suffering with monkeys (representational image)

అది లంక కాదు. కానీ వానర సైన్యం వదిలిపెట్టడం లేదు. ప్రతి నిత్యం దండయాత్ర చేస్తున్నాయి. వరుస దాడులతో దడ పుట్టిస్తున్నాయి. ఆ ప్రాంతవాసులకి రామాయణంలోని కిష్కిందకాండని గుర్తుచేస్తున్నాయి వానరాలు. షాపుల కెళ్లి సరుకులు తీసుకురావాలన్నా.. డాబాపైన ఏమైనా ఆరబెట్టాలాన్నా భయం. తలుపులు కాదు కదా.. కనీసం కిటీకీలు తెరవాలన్నా ఆ ప్రాంత వాసులకు వణుకుపుడుతుంది. ఎప్పుడు ఎలా కోతులు మీద పడతాయో అని గ్రామస్తులు దడుసుకుంటున్నారు. కోతుల బెడదతో ఉలిక్కిపడుతున్న ఆ ప్రాంత పరిస్థితిపై హెచ్ఎంటీవీ స్పెషల్‌ స్టోరీ..

తరిగిపోతే తరలిరామా అంటూ తనదరికి రాని వనాల కోసమంటూ వానరాలు దండయాత్ర చేస్తున్నాయి. వనాలు తరిగిపోతున్నాయి. వానరాలు జనవాసాల్లోకి తరలివస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లాలో శంకరపట్నం మండలంలోని గ్రామాలపై కోతులు దండయాత్ర చేస్తున్నాయి. వందల సంఖ్యలో కదిలివచ్చి ఆ గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

కోతుల బెడద కారణంగా గ్రామంలోని వ్యాపారులు దివాళా తీస్తున్నారు. వానరాలతో వేగలేక వ్యాపారులు షెటర్‌ క్లోజ్‌ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కిరాణం షాపుల్లోకి చొరబడి ఏదీ దొరికితే అది పట్టుకొని పరుగెడతాయి. కూరగాయాల షాపుల్లోకి చేరి గందరగోళం సృష్టిస్తున్నాయి.

ఊళ్లో వ్యాపారులనే కాదు. ఊరి బయట పంట పొలాలను కూడా వదలిపెట్టడం లేదు కోతులు. రైతుల కష్టాన్ని క్షణాల్లో నాశనం చేస్తున్నాయి. పండిన పంటను పీకిసి కోతి చేష్టలు ప్రదర్శిస్తున్నాయి.

ఇక పిల్లలు బయట ఆడుకునే పరిస్థితి లేదు. పిల్లలను బయటికి పంపిస్తే కోతులు దాడులు చేస్తాయని తల్లిదండ్రులు భయపడుతున్నారు. అందుకని వారిని నాలుగు గోడల మధ్యనే ఉంచుతున్నారు. ఇక ఇంటి చుట్టూ ఇనుప చువ్వులు ఏర్పాటు చేసుకొని జైలు జీవితం అనుభవిస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం, మొలాంగుర్, కేషపట్నం, లింగపూర్, కొత్తగట్టు, వంకాయగూడెం, గొల్లపల్లి, తాడికల్‌తో పాటు చాలా గ్రామాల్లో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎవరైన ఈ గ్రామాల మధ్య ద్విచక్రవాహనాలపై వెళ్తే చాలు అడ్డం తిరిగి వారిని కిందపడేస్తాయి.

గతంలో కోతుల బెడద నుంచి ఈ ప్రాంతాలను రక్షించడానికి ప్రభుత్వం ఆపరేషన్ మంకీ నిర్వహించింది. ఐనా మళ్లీ కోతుల సంఖ్య పెరుగుతూనే ఉందని స్థానికులు వాపోతున్నారు. ఎలాగైనా తమను ఈ కోతుల బెడద నుంచి రక్షించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News