తెలంగాణ ఎన్నికల్లో ధన ప్రవాహం.. ఖర్చుకు వెనుకాడని రాజకీయ పార్టీలు

TS Elections 2023: గెలుపే లక్ష్యంగా దూసుకెళ్ళిన అభ్యర్థులు

Update: 2023-11-29 02:56 GMT

తెలంగాణ ఎన్నికల్లో ధన ప్రవాహం.. ఖర్చుకు వెనుకాడని రాజకీయ పార్టీలు

TS Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక మిగిలింది పోల్‌ మేనేజ్‌ మెంట్.. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ధనప్రవాహం పెరిగిపోయింది.. వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు ఎన్నికల బరిలో దిగడంతో ఎక్కడ చూసినా డబ్బే డబ్బు.. అభ్యర్థులు చేసిన ఖర్చు కోట్లలో ఉంటుందని అంచనా. దీనికంతటికీ కారణం ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న సంకల్పమే ఎంతటి ఖర్చుకైనా వెనకాడకుండా చేసింది.. తెలంగాణ ఎన్నికల ఖర్చు ఈసారి 10వేల కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల వ్యయానికి ఈసీ విధించిన ఖర్చుల పట్టిక.. ప్రస్తుత మార్కెట్లో ధరలు చూస్తే ఏ మాత్రం పొంతనకుదరడం లేదు.

చాయ్‌ రూ.5.. కాఫీ రూ.6.. సమోసా రూ.10.. పులిహోర రూ.30.. చికెన్‌ బిర్యానీ రూ.140.. ఇవీ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నిర్ణయించిన ధరలు. బహిరంగ మార్కెట్ కు.. ఈసీ నిర్ణయించిన ధరలకు చాలా వ్యత్యాసముంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గరిష్ఠ వ్యయాన్ని ఎన్నికల సంఘం రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచింది. ఎన్నికల నిబంధనల ప్రకారం.. అభ్యర్థులు నామినేషన్‌ వేసిన రోజు నుంచి పోలింగ్‌ ముగిసే వరకు ఖర్చుచేసిన ప్రతి పైసా ఈసీకి లెక్క చూపాల్సిందే. క్షేత్రస్థాయిలో ఉన్న ధరలకు, ఈసీ నిర్ణయించిన ధరలకు అసలు పొంతనే లేదు.. అందులో అభ్యర్థులు చేస్తున్న ఖర్చు చూస్తే నోరెళ్ళబెట్టాల్సిందే.. ఎన్నికల వేళ ప్రధాన పార్టీ అభ్యర్థి అడుగు తీసి అడుగేస్తే రూ.వేలల్లో ఖర్చవుతుంది. అభ్యర్థుల ప్రచార తీరు, ఖర్చు వివరాలను నిఘా బృందాలు డేగకళ్లతో పరీక్షిస్తున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నగదు ప్రవాహం ఏరులై పారుతోంది. అభ్యర్థులు, అనుచరులు ఖర్చుకు వెనకాడటం లేదు.. కొంత మంది ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖర్చు ఒక్కొక్కరిది దాదాపు 250 నుంచి 300 కోట్లు దాటే అవకావం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ ఎన్నికల ఖర్చు వేల కోట్లు దాటినా ఆశ్చర్యం లేదన్నట్లు తెలుస్తోంది. దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలతో పోల్చితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే అత్యంత ఖరీదైనవిగా అనిపించక మానదు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, సెకండ్ క్యాడర్ నేతలకు కానుకలు, కార్యకర్తలకు విందులు.. ఓటర్లకు పంపిణీ.. ప్రచారంలో వాహనాలు, కటౌట్లు, బ్యానర్లు, ప్రచార పటాటోపంతో అత్యంత ఖరీదైన ఎన్నికగా కనిపిస్తోంది.

అయితే ఎన్నికల్లో ఖర్చు విచ్చలవిడిగా పెరిగిపోవడం కేవలం మనదేశంలో మాత్రమే కాదు పాశ్యాత్య దేశాలతో పాటు ఎన్నో దేశాల్లో ప్రస్తుత కాలంలో ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగి పోయింది. అమెరికా ఎన్నికలను చూస్తే గత 20 ఏళ్ళలో ఎన్నికల వ్యయం మూడు రెట్లు పెరిగినట్లు పలు అద్యయనాల్లో తేలింది. 2000 సంవత్సరంలో ఫెడరల్ ఎన్నికల ఖర్చు 4.6బిలియన్ డాలర్లు ఉంటే 2020 నాటికి 14.4 బిలయన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. యూరప్ లో కూడా ఇదే అదే స్థాయిలో ఎన్నికల ఖర్చు పెరిగిపోయింది. పోలింగ్ వ్యవస్థలో డబ్బు విచ్చల విడిగా ఖర్చు చేస్తున్నండటంతో ఎన్నికల ప్రక్రియ నవ్వుల పాలవుతోందని ప్రజాస్వామ్య దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. గడిచిన కొన్ని దశాబ్దాలుగా విశ్వవ్యాప్తంగా కొన్ని ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికల సంస్కరణలు తీసుకొస్తున్నారు. బ్రెజిల్, యూకే లాంటి దేశాల్లో పరిమితికి లోబడే ఖర్చు చేయాలన్న నిబందనలు తీసుకొచ్చారు. లండన్ లో కొంచెం ఖర్చు తగ్గినా మిగిలిన చోట్ల పెద్దగా మార్పు రాలేదని తెలుస్తోంది. కెనాడా, ఫ్రాన్స్, ఇటలీ, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో ప్రచార వ్యయానికి సంబంధించి ప్రత్యేక నిబంధనలున్నాయి. ఇక్కడ చేసిన ఖర్చు రీయింబర్స్ మెంట్ చేసుకునే అవకావం ఉంది. పబ్లిక్ ఫండింగ్ కు అవకావం ఉంటుంది. అమెరికాలో ఒబామా ఇదే విధంగా ప్రచారం చేశారు.. ఆ తర్వాత వచ్చిన వారు కూడా అదే పద్దతిని అనుసరిస్తున్నారు.

మన దేశంలో రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఇచ్చిన వారు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే అధికారంలో ఉన్న పార్టీలు కోట్ల రూపాయల ఫండింగ్ సొంతం చేసుకుంటూ ఉంటాయి. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం అంటే అందునా అధికారంలో ఉన్న పార్టీలకు ఇవ్వడం క్విడ్ ప్రో కో అన్నట్లే.. పార్టీలు నిలబడాలంటే విరాళాలు తప్పనిసరి. ప్రజలు, కంపెనీలు, వ్యాపారవేత్తల నుంచి విరాళాలు అందుకోవడం ద్వారానే అవి మనగలుగుతాయి. పార్టీల అభిమానులు తమకు తోచినంత విరాళంగా అందిస్తారు. వ్యాపార, పారిశ్రామిక వేత్తలు మాత్రం భవిష్యత్తులో ప్రభుత్వాలు తమ జోలికి రాకుండా విరాళాల రూపంలో పెద్దమొత్తంలో సమర్పించుకుంటారు. విరాళాల రూపంలో వచ్చిన సొమ్మును ఆయా పార్టీలు ఎన్నికల్లో ఉపయోగించుకుంటాయి. ఇక అసలు విషయానికి వస్తే వస్తే 2021-22 సంవత్సరానికి గాను కేంద్రంలో అధికార BJPకి ఏకంగా 614 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి. మొత్తం అన్ని రాజకీయ పార్టీలకు కలిపి రూ. 780 కోట్లు వస్తే.. ఒక్క బీజేపీకే రూ. 614 కోట్లు వచ్చాయి. అంటే మొత్తం విరాళాల్లో ఇది 80 శాతమన్నమాట. బీజేపీ తర్వాతి స్థానంలో కాంగ్రెస్‌కి రూ. 95 కోట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్‌సీపీకి రూ. 58 కోట్ల విరాళాలు వచ్చాయి. మిగతా ప్రాంతీయ పార్టీలు ఆ తర్వాతి స్థానాలతో సరిపెట్టుకున్నాయి. బీజేపీ అందుకున్న రూ. 614 కోట్ల విరాళాల్లో కార్పొరేట్లు, వ్యాపారవేత్తల నుంచే ఏకంగా రూ. 548 కోట్ల విరాళాలు వచ్చిపడ్డాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలన్నీ కేంద్రం కార్పొరేట్ సంస్థలకు అమ్ముడు పోయిందని విమర్శలు గుప్పించాయి.

ఇదీ మన దేశంలో ఎన్నికల తంతు.. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఒకే ఒక లక్ష్యం ముందు ఈసీ విధించిన ఆంక్షలు బలాదూర్‌గా మారాయి. ఎద్దుల పోరాటంలో లేగదూడలు బలైనట్లు సంపన్న అభ్యర్థులు చేస్తున్న ఎన్నికల ఖర్చు ప్రవాహంలో పేద అభ్యర్థులు కొట్టుకు పోతున్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల సంస్కరణలు తెస్తున్నా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న రాజకీయ నేతల ముందు పాచిక పారడం లేదన్న విమర్శలూ ఉన్నాయి.

 

Tags:    

Similar News