ఘనంగా ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు
*అరేబియా సముద్రంలో మోటార్ బోట్లపై వెళ్తూ శుభాకాంక్షలు
Kavitha Birthday Celebrations: తెలంగాణ ఉద్యమం ఊపిరిగా సాగిన రోజుల్లో జన జాగృతి కోసం ఆమె ఎంచుకున్న మార్గం సాంస్కృతిక చైతన్యం. తెలంగాణకు సొంతమైన బతుకమ్మ పండుగ సంబరాలకు ఉద్యమాన్ని జోడించి ప్రత్యేక రాష్ట్ర సాధనలో తనవంతు పాత్ర పోశించారు కవిత. తెలంగాణ జాగృతి వేదికగా సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తూ ముందుకు సాగుతున్న ఎమ్మెల్సీ కవిత జన్మదిన ఉత్సవాలను అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు.
స్వరాష్ట్ర సాధనకు సాంస్కృతిక నేపథ్యాన్ని జోడించి బతుకమ్మకు ఐకానిక్‌గా నిలిచిన కవిత పుట్టిన రోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. తండ్రి కేసీఆర్ రాజకీయ వారసత్వ నీడ నుంచి వచ్చిన కవిత..జాగృతి సంస్థ ఏర్పాటు చేసి నేటి తరం సాంస్కృతిక, రాజకీయ యవనికపై తనదైన ముద్రవేసుకోగలిగారు. మలిదశ ఉద్యమంలో మహిళాశక్తిని బతుకమ్మ ఉత్సవాల రూపంలో స్వరాష్ట్ర సాధనవైపు మళ్లేలా నిలపడంలో శక్తివంచన లేకుండా ప్రయత్నించిన నేతగా విమర్శకుల మన్ననలు సైతం సాధించగలిగారు.
ఉద్యమ సమయంలో జాగృతి సంస్థ వేదికగా జనాలను చైతన్యం చేసిన కవిత..ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత చట్టసభల ప్రతినిధిగా తనవంతు పాత్ర పోశిస్తున్నారు. మెట్టినిల్లు నిజామాబాద్ నుంచి లోక్‌సభ సభ్యురాలిగా పనిచేసిన కవిత ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలిగా కొనసాగుతున్నారు. తెలంగాణ యాస, భాషల్లోనే కాకుండా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి పట్టున్న కవిత యువతరం జాతీయ, రాష్ట్ర నేతల్లో తనదైన ముద్ర వేసుకోగలిగారు. జాతీయ రాజకీయాల్లో తెలంగాణ సత్తాను మరోసారి చాటాలని ప్రణాళికలు రచిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనడుస్తున్నారు కవిత.
తెలంగాణ ఉద్యమానికి, బతుకమ్మను జోడించి స్వరాష్ట్ర కాంక్షను దేశ విదేశాల్లో వెలిబుచ్చేలా జాగృతం చేసిన మహిళా నాయకురాలిగా తనదైన ముద్ర వేసుకున్న కవిత పుట్టిన రోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు అభిమానులు. సాంస్కృతిక వారసత్వాన్ని నేటి తరం సామాజిక అంశాలకు జోడిస్తూ ముందుకు సాగుతున్న కవిత..మహిళా నాయకురాలిగా మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నారు అభిమానులు.