TS High Court: సింగిల్ జడ్జి ఉత్తర్వుల ఆధారంగా సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేక్
TS High Court: డివిజన్ బెంచ్ విచారణ పూర్తయ్యే వరకు ఆగాలని సీబీఐకి ఆదేశం
TS High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ విచారణకు హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. హైకోర్టులో డివిజన్ బెంచ్ ముందు కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆగాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అంతకుముందు బీజేపీ తరఫున దామోదర్ రెడ్డి వాదనలు వినిపించారు. బీజేపీ ఎమ్మెల్యేలను ఎవర్నీ కొనుకోలు చేయలేదని.. ఎక్కడా ప్రభుత్వాలను కూల్చలేదని హైకోర్టుకు విన్నవించారు. మరోవైపు హైకోర్టు ఆదేశాలిచ్చినా.. సిట్ డాక్యుమెంట్స్ ఇవ్వలేదని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చింది సీబీఐ. కేసు వివరాలు అప్పగిస్తే ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని తెలిపగా.. ధర్మాసనం విచారణ పూర్తయ్యే వరకు ఆగాలని హైకోర్టు స్పష్టం చేసింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు విచారణలో వాడివేడి వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున సుదీర్ఘంగా వాదనలు వినిపించారు సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దవే. సీఎం ప్రెస్ మీట్ కారణంగా సీబీఐకి దర్యాప్తు ఇవ్వడం సరికాదని, పార్టీ అద్యక్షుడుగా సీఎం ప్రజలకు వాస్తవాలు చెప్పే హక్కుందని తెలిపారు. అంతకుముందే కేసు వివరాలు మీడియా ప్రసారం చేసిందని చెప్పారు. సరైన కారణం చూపకుండా సీబీఐకి బదిలీ చేయడం సిట్ విధులను హరించడమే అని నాలుగు గంటలపాటు దవే సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ప్రభుత్వం దాఖలు చేసిన క్రిమినల్ రిట్ అప్పీల్ పిటిషన్ ఈ కోర్టు పరిధిలోకి రాదని నిందితుల తరపు న్యాయవాది వాదించారు. సిట్ దర్యాప్తు పారదర్శకంగా లేదని పరిశీలించాకే సీబీఐకి కేసు బదిలీ చేశారని అన్నారు. సుప్రీంకోర్టులో మాత్రమే క్రిమినల్ రిట్ అప్పీల్ చేసుకోవాలని.. సుప్రీంకోర్టు ఇచ్చిన పలు జడ్జిమెంట్లను ప్రస్తావించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై జరిగిన విచారణలో హైకోర్టు కీలక వాఖ్యలు చేసింది. BJP, BRSల మధ్య కోర్టులో వాదనలు ఎందుకని న్యాయస్థానం ప్రస్తావించింది. BJP పిటిషన్ ను సింగిల్ బెంచ్ డిస్మిన్ చేసినప్పుడు ఈ అప్పీల్ లో మీ వాదనలు ఎందుకని ప్రశ్నించింది. మా పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా సిట్ తరపు న్యాయవాది దవే వాదించారని, దానికి సమాధానం చెప్పడానికే రాజకీయాలు ప్రస్తావించానని BJP తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అదే క్రమంలో మొయినాబాద్ కేసు వివరాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. సిట్ తమకు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. డాక్యుమెంట్లు ఇస్తే విచారణ ప్రారంభిస్తామని హైకోర్టుకు తెలిపింది. అయితే హైకోర్టులో కేసు విచారణ పూర్తయ్యే దాకా ఆగాలని ధర్మాసనం సీబీఐకి సూచించింది. ఆ తర్వాత సీబీఐ వాదన కూడా వింటామని పేర్కొంది.
మరొకొత్త అంశాన్ని ప్రతివాదుల తరపు న్యాయవాదులు వినిపించారు. 2014 నుంచి 2018 వరకు BRSలో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేల జాబితాను కోర్టుకు సమర్పించారు. 2014 నుంచి 2018 వరకు 37 మంది ఎమ్మెల్యేలను BRS ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీలోకి చేర్చుకుందని ఆరోపించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మరోసారి దుష్యంత్ దవే ప్రభుత్వం తరుపున కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వినిపించనున్నారు. వాడివేడి వాదనల మద్య సాగుతున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ.. అంతిమంగా సిట్‌కా లేక సీబీఐకా అనే ఉత్కంఠ ఇరు వర్గాల్లో సాగుతోంది.