Nereducharla: రెడ్ జోన్ ఏరియాలో పర్యటించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పర్యటించారు.
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పర్యటించారు.ఈ సందర్భంగా రెడ్ జోన్ లో ఉన్నటువంటి ప్రజలకు కరోనా వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. ఈ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న పశు వైద్యశాలల్లో మందుల కొరత ఉన్నట్లు వెంటనే మందులను తెప్పించే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు రోజు కూరగాయల కోసం, చికెన్ మటన్ కోసం బయటకు వస్తున్నారని పదిరోజులపాటు ఉన్నదానితో సంతృప్తి చెంది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ తమ ఇళ్లలోనే ఉండాలని కోరారు.
అదేవిధంగా బ్యాంకుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేసిన విపత్తు సహాయం డబ్బు తీసుకోకుంటే వెనక్కి పోతుందని పుకార్లు వస్తున్నాయని ఇవి వాస్తవం కాదని ఎవరి డబ్బు వారి అకౌంట్ లోనే ఉంటుందని తెలిపారు. నేరేడుచర్ల లో రెడ్ జూన్ లో ఉన్నటువంటి ప్రజలకు ప్రత్యేకమైన వాలంటీర్లను ఏర్పాటు చేసినట్లు వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో 50 వేల మందికి కేవలం 20 మంది పోలీసులు మాత్రమే తమ కుటుంబ సభ్యులను వదిలి పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారని అదేవిధంగా వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, ఆశా వర్కర్లు, స్వచ్ఛంద సంస్థల వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని వారికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వం సూచనలు పాటించి ప్రతి ఒక్కరూ ఇంట్లో నుండి బయటకు రాకుండా ఉండాలని చేతులెత్తి నమస్కరిస్తూ తెలిపారు.