Mission Bhagiratha: వరంగల్ లో నత్తనడకన మిషన్ భగీరథ పనులు
Mission Bhagiratha: సీఎం కేసీఆర్ మానస పుత్రికైన మిషన్ భగీరథ పథకం పనులు వరంగల్‌లో నత్తనడకన సాగుతున్నాయి.
Mission Bhagiratha: సీఎం కేసీఆర్ మానస పుత్రికైనా మిషన్ భగీరథ పథకం పనులు వరంగల్‌లో నత్తనడకన సాగుతున్నాయి. మూడేళ్లు గడుస్తున్నా నేటికి పూర్తిస్థాయిలో పనుల పురోగతి లేదు. ఉగాది నాటికి ఉచితంగా నీరు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నా..! అక్కడ కార్పొరేషన్ అధికారులు.. పనుల్లో వేగం పెంచకపోవడంతో లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు.
వరంగల్‌లో పేదవాళ్లకు మంచినీళ్ల కరువు...
వరంగల్.. పేరుకే పెద్దనగరం. పేదలకు మాత్రం మంచినీళ్లు అందించలేని పరిస్థితి. ఆడపడుచులు బిందెలు ఎత్తుకుని బయట తిరగకూడదని తెలంగాణ ప్రభుత్వం.. మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ప్రభుత్వం నిధులు ఇచ్చి పనులు చేయమన్నా.. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పథకం ముందుకు సాగడం లేదు. దీంతో ప్రజల దగ్గర ప్రభుత్వం అబాసుపాలవుతోంది. మరోవైపు.. గ్రేటర్ ఎన్నికల నాటికైనా మంచినీరు అందించాలని స్థానిక నేతలు ప్రయత్నం చేస్తున్నారు.
రెండేళ్లుగా వరంగల్‌లో మిషన్ భగీరథ పనులు...
రెండేళ్లుగా నగరంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి. అయితే అవి ఇప్పటికీ పూర్తికాకపోగా.. ఆపనుల వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామంటున్నారు ప్రజలు. చెప్పాలంటే పనులు ఇంకా మొదటి దశలోనే ఉండటం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రం మొత్తం పూర్తయిన వరంగల్‌లో పూర్తికాకపోవడంతో ప్రజాప్రతినిధులు, అధికారులపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ట్రై సిటీస్‌గా పేరొందిన వరంగల్, హన్మకొండ, కాజిపేట...
ట్రై సిటీస్‌గా పేరుగాంచిన వరంగల్, హన్మకొండ, కాజిపేటలో ఇప్పటికీ మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదంటున్నారు ప్రజలు. అయితే మూడు నెలల క్రితం ఉగాది నాటికి మంచినీరు అందిస్తామని ప్రభుత్వం తమకు హామి ఇచ్చిందని చెబుతున్నారు. కానీ మహానగరంలో ఇంకా పైప్‌లైన్ పనులే పూర్తి కాలేదు. మరి పనులు ఎప్పుడు పూర్తి చేస్తారూ..? ఎప్పుడు ట్రయల్స్ చేస్తారూ..? ఎప్పుడు అందిస్తారూ..? అని గ్రేటర్ వరంగల్ ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.