Minister Talasani Srinivas : నగరాల్లో కొత్తగా నిర్మిస్తున్న భవనాల వద్దకు కొంత మంది వచ్చి జులూమ్ చేస్తూ అక్రమంగా డబ్బులను వసూలు చేస్తుంటారు. పెద్ద పెద్ద నగరాల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొన్ని వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్‌లో కొత్తగా నిర్మిస్తున్న భవనాల దగ్గరికి డబ్బుల కోసం నాయకులు కానీ, లీడర్లు కానీ వచ్చి బెదిరింపులకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామని, వారిపై కేసు నమోదు చేసి జైల్లో పెడతామని హెచ్చరించారు.
గోశామహల్ నియోజకవర్గంలో కొంత మంది నాయకులు భవన నిర్మాణ దారుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. గురువారం తలసాని హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ భవన నిర్మాణదారుల దగ్గరకు ఎవరూ కూడా వెళ్లి అక్రమ వసూళ్ల పాల్పడకూడదని తెలిపారు. ఇతర పార్టీలకు చెందిన వారిని మాత్రమే కాకుండా సొంత పార్టీ చెందిన నాయకులు ఇలాంటి పనులు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారిని వదిలేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఎవరైనా నాయకులు నిర్మాణ దారులను బెదిరిస్తే భయపడకుండా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు.
ఈ మీడియా సమావేశం నిర్వహించడానికన్నా ముందు మాసబ్ ట్యాంక్‌లోని కార్యాలయంలో దేవాదాయ భూముల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై కార్పొరేటర్లు, దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. గోశామహల్ నియోజకవర్గంలో పురాతన దేవాలయాల అభివృద్ధికి రినోవేషన్ కమిటీని వేసి అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. దేవాలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా, పురాతన దేవాలయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను మంత్రి చర్చించారు.