చేతకాని దద్దమ్మలు కుట్రలు పన్నుతున్నారు : మంత్రి తలసాని
Fish distribution: చేతకాని దద్దమ్మలు అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
Fish distribution: చేతకాని దద్దమ్మలు అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని పెద్దచెరువులో 5వ విడత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం రోజున ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా క్షేమం పట్టని కొన్ని పార్టీల నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. కేవలం వారు తమ ఉనికిని చాటుకునేందుకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రగతి భవన్‌ను ముట్టడించి అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనే 55 శాతం పంటలు తెలంగాణ రాష్ట్రంలోనే పండుతున్నాయని తెలిపారు.
సుధీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ నాయకులు ఏనాడు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేరని ఆయన ధ్వజమెత్తారు. సమైక్య పాలనలో కులవృత్తులు నిర్వీర్యమయ్యాయని, తెలంగాణ ఏర్పడిన తర్వాత కులవృత్తుల బలోపేతానికి సిఎం కెసిఆర్ అనేక చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు. కెసిఆర్ పాలనలో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని తీసుకురావడం కోసమే పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి చెప్పారు. గతంలో గోపాలమిత్ర జీతాలను రూ.3000 వేల నుండి రూ.8000 వేల వరకు పెంచిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. కరోనా సమయంలో కూడా రైతులు పండించిన పంటను కొనుగోలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అని మంత్రి తలసాని పేర్కొన్నారు.