KTR: బీజేపీ నేతలపై కేటీఆర్ ట్వీట్ల వర్షం

KTR: అమిత్ షా హిందీ వ్యాఖ్యలపై కేటీఆర్ ట్వీట్లు

Update: 2022-04-10 13:00 GMT

Breaking News: ఏపీ కేబినెట్ లో గుడివాడ అమర్నాథ్ కు చోటు

KTR: రాజకీయంగా కొద్దికాలంగా ఉప్పునిప్పుగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్-బీజేపీ లు ఇప్పుడు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించుకుంటున్నాయి. హిందీ విషయంలో అమిత్ షా చేసిన కామెంట్లపై దక్షిణాది రాజకీయ ప్రముఖులు ఇప్పటికే మండిపడుతుండగా ఏం తినాలో, ఏ భాష మాట్లాడాలో ప్రజలకే వదిలేయాలన్నారు కేటీఆర్.

కేంద్రం విధానాలపై గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. దేశ ప్రజలంతా ఇంగ్లిష్‌, స్థానిక భాషల్లో కాకుండా హిందీలోనే మాట్లాడాలన్న అమిత్ షా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఇప్పటికే మండిపడుతున్నాయి. ఇది దేశ భిన్నత్వం మీద దాడి అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులో ఇప్పటికే జాతీయ విద్యా విధానంపై హిందీని బలవంతంగా రుద్దడంపై సీఎం స్టాలిన్ విరుచుకుపడుతున్నారు. తాజాగా అమిత్ షా కామెంట్లపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

భారతదేశం వసుధైక కుటుంబమని, భిన్నత్వంలో ఏకత్వమే మన బలమని కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రజలు ఏం తినాలో, ఏం ధరించాలో, ఎవరిని ప్రార్థించాలో, ఏ భాష మాట్లాడాలో ప్రజల నిర్ణయాలకే వదిలేయాలని సూచించారు. భాషా దురభిమానం, ఆధిపత్యం చెలాయించడం వంటివి బూమరాంగ్‌ అవుతాయన్నారు. హిందీలోనే మాట్లాడాలన్న ఆంక్షలు విధిస్తే దేశం నష్టపోతుందన్నారు. తాను మొదట ఇండియన్ ని అని ఆ తర్వాత తెలుగువాడిని, తెలంగాణవాడిని అన్నారు. మాతృభాష తెలుగులోనే మాట్లాడతానని, అవసరమైనప్పుడు ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ మాట్లాడగలనని ట్వీట్ చేశారు. ఇక ఇంగ్లిష్ ను నిషేధిస్తే యువతకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు.

అయితే అమిత్ షా జాతీయ భాషగా హిందీని గౌరవించాలని సూచించారని, అందరూ ఆ భాష నేర్చుకోవాలని సూచిస్తున్నా కావాలని తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ రాజకీయం చేస్తున్నారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి క్రష్ణసాగర్ రావు ఆరోపించారు. ప్రాంతీయ వాద ఓటు బ్యాంకుతో రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలు మాతృభాషకు చేసిన సేవ ఏంటో చెప్పాలన్నారు.

బీజేపీ హిందీని బలవంతగా రుద్దాలని ప్రయత్నం చేస్తోందని దక్షిణాది రాజకీయ ప్రముఖులు ఆరోపిస్తుండగా అమిత్ షా వ్యాఖ్యల సారం గ్రహించక కావాలనే రాజకీయం చేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News