Minister KTR : ఆస్తులను న‌మోదు చేయడానికి ద‌ళారుల‌ను న‌మ్మొద్దు : కేటీఆర్

Update: 2020-09-28 14:32 GMT

Minister KTR : ప్రభుత్వానికి ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదని తెలంగాణ మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని రెవెన్యూ సమస్యలపై సోమవారం హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ స‌మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ‌ రాష్ట్రంలో భూ వివాదాల‌ను శాశ్వతంగా ప‌రిష్కారించాల‌నే ఉద్దేశంతోనే ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుందని అందులో భాగంగానే ప్రభుత్వం కొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని తీసుకువచ్చింద‌ని కేటీఆర్ అన్నారు. దేవాదాయ, వక్ఫ్‌, పరిశ్రమలు తదితర భూముల్లో వివాదాల వల్ల యాజమాన్యపు హక్కు లేని భూముల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేలా.. ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు.

జీవో నంబర్‌ 58, 59 ద్వారా ప్రభుత్వ భూములు, ఎలాంటి వివాదాలు లేని స్థలాలను మాత్రమే రెగ్యులరైజ్‌ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆస్తుల న‌మోదుకు సంబంధించి ద‌ళారుల‌ను న‌మ్మొద్దన్నారు. ఎవ‌రికీ ఒక్క పైసా కూడా ఇవ్వొద్దని కేటీఆర్ సూచించారు. మిగతా సమస్యలు పరిష్కారానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. స‌మీక్ష స‌మావేశానికి విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని శాసనసభ్యులు గాధారి కిశోర్ కుమార్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, ప్రభుత్వ చీఫ్ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ,రవీంద్ర నాయక్ ,చిరుమర్తి లింగయ్య, ఎన్.భాస్కర్ రావు లతో పాటు మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు.

Tags:    

Similar News