కేటీఆర్, భట్టిని పొగడటం వెనుక మతలబు ఏంటి.. భట్టికి గులాబీ తీర్థం ఇప్పిస్తారా?

KTR: కాంగ్రెస్ అన్నా... ఆ పార్టీ అన్నా అంతెత్తున ఒంటికాలి మీద లేచి పడే గులాబీ నేతలు అదే పార్టీలోని ఓ నాయకుడి మీద పాజిటివ్ ఓపినియన్‌తో ఉన్నారట.

Update: 2021-10-20 07:54 GMT

కేటీఆర్, భట్టిని పొగడటం వెనుక మతలబు ఏంటి.. భట్టికి గులాబీ తీర్థం ఇప్పిస్తారా?

KTR: కాంగ్రెస్ అన్నా... ఆ పార్టీ అన్నా అంతెత్తున ఒంటికాలి మీద లేచి పడే గులాబీ నేతలు అదే పార్టీలోని ఓ నాయకుడి మీద పాజిటివ్ ఓపినియన్‌తో ఉన్నారట. హస్తం పార్టీలో ఉన్నది ఒకే ఒక్క మంచివాడని, మిగిలిన వారందరూ అక్రమార్కుల పెత్తనమేనంటూ కితాబినిస్తున్నారు. ఇంతకీ గులాబీనేతలు గొప్పగా చెబుతున్న ఆ కాంగ్రెస్‌ నాయకుడు ఎవరు? ఇన్నాళ్లూ లేని గౌరవమూ, ప్రేమా ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చింది?

హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఏమో కానీ, కారు, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కేసీఆర్ పేరు చెబితేనే కాంగ్రెస్‌ సీనియర్లు కొందరు కారాలు మిరియాలు నూరుతున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ అవకాశం దొరికినప్పుడల్లా తిడుతూ వచ్చారు. కాకపోతే 12 మంది ఎమ్మెల్యేలు కారెక్కడంతో అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. భట్టి విక్రమార్క కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతూ వస్తున్నారు.

ప్రధాన ప్రతిపక్షనేత హోదా కోల్పోయిన తర్వాత కూడా భట్టి టీఆర్ఎస్‌ సర్కార్‌పై పెద్ద ఎత్తున ఉద్యమించారు. కరోనా సమయంలో ఆసుపత్రుల సందర్శనలు, మార్కెట్‌ యార్డ్‌లో పర్యటనలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో లోపాలను ఎత్తిచూపడాలు, అలా గులాబీ పార్టీకి, కాంగ్రెస్‌ పార్టీకి మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలోనే కొనసాగింది. ఇది కూడా కొంతకాలానికి సద్దుమణిగింది.

అయితే, కొన్నాళ్ల నుంచి భట్టి విక్రమార్క వ్యవహారంలో టీఆర్ఎస్ అనుసరిస్తున్న వైఖరిలో మార్పు వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోందట. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత గులాబీ నేతలు భట్టితో కాస్త చనువుగా ఉంటున్నారు. దళితబంధు పథకం రూపకల్పన సమయంలో నిర్వహించిన అఖిలపక్ష భేటీకి కీలక దళిత నేతలను ఆహ్వానించారు. అప్పడు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పర్మిషన్ లేకుండానే ప్రగతిభవన్‌లో సమావేశానికి హాజరయ్యారు భట్టి విక్రమార్క. కేసీఆర్‌ సర్కార్‌ ఆలోచనలను మెచ్చుకొని అభినందించారు. సీఎం కేసీఆర్ కూడా భట్టి విక్రమార్క సలహాలు సూచనలను ఆహ్వానించారు. అంతటితో ఆగకుండా రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు కోసం నాలుగు నియోజకవర్గాల్లో ఒక్కో మండలాన్ని ఎంచుకున్న ప్రభుత్వం విక్రమార్క ప్రాతినిధ్యం వహించే మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేసింది.

అప్పటి నుంచి భట్టి విక్రమార్క విషయంలో గులాబీ నేతలు పూర్తి సంయమనంతో ఉంటున్నారు. ఏకంగా టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అయితే, విక్రమార్కను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో భట్టి విక్రమార్క మంచోడనీ ఓ పద్దతున్నోడంటూ కితాబినిచ్చారు. కాంగ్రెస్‌లో భట్టి చెప్పిన మాటలు ఎవ్వరూ వినడం లేదంటూనే అక్కడంతా గట్టి అక్రమార్కులదే నడుస్తుందని ఎద్దేవా చేశారు. దాంతో పాటు ఆయన నియోజకవర్గంలోని చింతకాని మండలానికి వందకోట్లు దళిత బంధువు కోసమిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

పార్టీలో, ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న కేటీఆర్‌ భట్టి విక్రమార్కను పొగడటం వెనుక ఏదో మతలబు ఉందని అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి భట్టి విక్రమార్కను టీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తారని కూడా చర్చ జరుగుతోందట. మొత్తానికి కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించే వర్గానికి వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ పార్టీ గాలం వేస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి భట్టి మనసులో ఏముందో, ఆయన విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News