ఆదిలాబాద్‌ జిల్లాలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా

* అడ్డగోలుగా సర్కార్‌ భూముల్లో మొరం తవ్వకాలు * మైనింగ్ అనుమతులు లేకుండానే మొరం తవ్వకాలు * అధికారుల అండతోనే బరితెగిస్తున్న మైనింగ్ మాఫియా * మొరం తవ్వితే కఠిన చర్యలు తప్పవంటున్న అధికారులు * వందల కోట్ల రూపాయలు సర్కార్ ఖజానాకు గండి

Update: 2020-11-20 06:01 GMT

representational image

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో మొరం మాఫియా బరితెగించింది. నిబంధనలకు పాతరేసింది. సర్కారు భూముల్లో అడ్డగోలుగా మొరం తవ్వకాలు చేస్తోంది. రాత్రి పగలు, తేడా లేకుండా ప్రొక్లైన్లతో మొరాన్ని తోడేస్తుంది. వందల లారీలలో మొరంను తరలిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మొరం మాఫియా దోపిడి దందాపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం..

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో వంద ఎకరాల సర్కార్ భూమి ఉంది. మావల గ్రామంలో ఉన్న ఈ భూమిలో నిబంధనలకు పాతరేసి మొరం మాఫియా తవ్వకాలు చేస్తోంది. అనుమతులు లేకుండా దర్జాగా మొరాన్ని కొల్లగొడుతున్నారు దోపిడి దారులు.

మూడు భారీ ప్రోక్లన్లతో మాఫియా తోడేస్తుంది. తవ్విన మొరాన్ని రోజు వందలాది టిప్పర్లలో తరలిస్తోంది. దాంతో ఒకప్పుడు అడవిని తలపించే ఈ ప్రాంతం.. ఇప్పుడు గుంతలు కనిపిస్తున్నాయి. మాఫియా దెబ్బకు గుట్టలు అన్నీ కనుమరగయ్యాయి.

మైనింగ్ అనుమతులు లేకుండా.. సర్కార్ ఖజానాకు గండి కొడుతున్నారు. అధికార పార్టీ అండదండలతోనే మొరాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సర్కారు భూములలో అనుమతులు లేక తవ్వకాలు జరపడం చట్ట విరుద్దమని అధికారులు అంటున్నారు. అనుమతి లేకుండా అక్రమంగా మొరం తవ్వుతున్న ప్రోక్లన్లను, టిప్పర్లను సీజ్‌ చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

సర్కారు భూములలో మొరం తవ్వకాలు చేస్తున్న మాఫియా పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మాఫియా పీడీ కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 





Tags:    

Similar News