లాక్‌డౌన్ సడలింపులతో తిరిగి నగరానికి భారీగా వలస కూలీలు
Lockdown Relaxations: సెకండ్‌వేవ్ కల్లోలం నుంచి భారత్ క్రమంగా కోలుకుంటుంది.
Lockdown Relaxations: సెకండ్‌వేవ్ కల్లోలం నుంచి భారత్ క్రమంగా కోలుకుంటుంది. లాక్‌డౌన్‌లు, కర్ఫూల సడలింపులతో పలు నగరాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ముఖ్యంగా కరోనా భయంతో సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన వలసకూలీలు తిరిగి భాగ్యనగరానికి చేరుకుంటున్నారు. దీంతో హైదరాబాద్‌లో రైల్వే స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి.
కరోనా లాక్‌డౌన్‌తో భవన నిర్మాణాలు సహా అనేక కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీనికితోడు కోవిడ్ భయంతో వలస కూలీలు నగరాన్ని విడిచి సొంతూళ్లకు వెళ్లిపోయారు. అయితే, ప్రస్తుతం సెకండ్‌వేవ్ ఉధృతి తగ్గడం, లాక్‌డౌన్ సడలింపులు వంటి అంశాలతో వలసకూలీలు తిరిగి నగరబాట పడుతున్నారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారింది. గతంలో రద్దయిన రైళ్లు సైతం తిరిగి ప్రారంభమయ్యాయి. దీనికితోడు అంతర్రాష్ట్ర సర్వీసులు నిలిచిపోవడంతో ఆంధ్రాకు వెళ్లేవాల్లు సైతం రైళ్లమీదే ఆధార పడుతున్నారు.
ఇదిలా ఉంటే నగరానికి వస్తున్న ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ సైతం అదనపు సర్వీసులను షురూ చేసింది. ప్రస్తుతం రోజుకు 850కి పైగా ఆర్టీసీ బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. వీటిలో సికింద్రాబాద్ నడిచే బస్సులకే ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటున్నట్లు ఆర్టీసీ ఉద్యోగులు చెబుతున్నారు. ఇక రానున్న రోజుల్లో లాక్‌డౌన్ సలడింపులు మరింత పెంచే అవకాశం కనిపిస్తుండడంతో బస్సుల సంఖ్యను మరింత పెంచే అవకాశం కనిపిస్తుంది.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భాగ్యనగరం త్వరలోనే సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే, పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తున్న నేపధ్యంలో కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.