Malkajgiri: అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి
Malkajgiri: తెలంగాణలోని మాల్కాజిగిరి దేశంలో అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా రికార్డ్ సృష్టించింది.
Malkajgiri: తెలంగాణలోని మాల్కాజిగిరి దేశంలో అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా రికార్డ్ సృష్టించింది. అత్యధిక మంది అభ్యర్థులు పోటీ చేసిన స్థానంగా నిజామాబాద్ ప్రథమస్థానాన్ని ఆక్రమించింది. అత్యధికంగా నోటా ఓట్లు 47వేల977 నమోదైన లోక్‌సభ నియోజకవర్గంగా ఆంధ్రప్రదేశ్‌లోని అరకు రెండోస్థానాన్ని దక్కించుకుంది. దేశంలో అత్యల్ప ఖర్చును ప్రకటించిన అభ్యర్థిగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి రెండోస్థానంలో నిలిచారు. 2019 సార్వత్రిక ఎన్నికల విశేషాలతో సీఈసీ మంగళవారం అట్లాస్ ప్రకటించింది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్‌లో దేశంలోనే అత్యధిక మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఇక్కడ స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన సరకన్ల రాజారెడ్డి కేవలం 84 ఓట్లు మాత్రమే సాధించారు. దేశంలో అత్యల్పంగా ఓట్లు పొందిన అభ్యర్థిగా రికార్డుకెక్కారు. 31 లక్షల 50వేల 313 మంది ఓటర్లతో తెలంగాణలోని మల్కాజిగిరి దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా నిలిచింది. 16 లక్షల 38 వేల 54 మంది పురుషులు, 15 లక్షల 11వేల910 మంది మహిళా ఓటర్లతో అత్యధిక పురుష, మహిళా ఓటర్లు ఉన్న నియోజకవర్గంగాను ఖ్యాతిగాంచింది.
తెలుగు రాష్ట్రాల్లో సర్వీసు ఓటర్లు అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 13వేల690 మంది ఉన్నారు. ఈ విభాగంలో దేశంలో దీనిది 15వ స్థానం. ఓటర్లలో మహిళల శాతం అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 7వ స్థానాన్ని ఆక్రమించింది.