మహబూబాబాద్‌లో దీక్షిత్ కిడ్నాప్, హత్య కేసులోని నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు పోలీసులు. తెలిసినవాళ్లే కిడ్నాప్ చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేపట్టామని అన్నారు ఎస్పీ కోటిరెడ్డి. ఆదివారం సాయంత్రం సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న దీక్షిత్‌ను మంద సాగర్ పెట్రోల్ బంక్‌కు వెళ్దామని చెప్పి తన బైక్‌పై ఎక్కించుకుని వెళ్లాడన్నారు. అనంతరం గుట్టల్లోకి తీసుకెళ్లి మంచినీళ్లలో తనతో పాటు తీసుకొచ్చిన నిద్రమాత్రలను కలిపి తాగించాడు. బాలుడికి అనుమానం రాకుండా ఉండేందుకు తాను కూడా ఆ నీటిని తాగాడు.
బాలుడు మత్తులో ఉండగానే గొంతు నులిమి హత్య చేశాడు నిందితుడు మందసాగర్. అనంతరం హత్య చేసిన ప్రదేశం నుంచే బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. అంతేకాదు బాలుడి ఇంటి దగ్గరకు వెళ్లి తల్లిదండ్రుల రియాక్షన్‌ను గమనించాడు. కొంత సమయం తర్వాత బాలుడి మృతదేహం ఉన్న ప్రదేశానికి వచ్చిన మందసాగర్ విషయం ఎక్కడ భయటపడుతుందోనన్న భయంతో దీక్షిత్ బాడీపై పెట్రోల్ పోసి తగలబెట్టాడని ఎస్పీ కోటిరెడ్డి స్పష్టం చేశారు.