మల్లికార్జున స్వామి ఆలయంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
Srisailam:
Srisailam: ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలిసి ఉన్న మహా పుణ్యక్షేత్రం శ్రీశైలం. భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఇవాళ్టి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.45 గంటలకు స్వామివారి అర్చకులు యాగశాల ప్రవేశం చేసి శాస్త్రోక్తంగా ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుద్దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. మరోవైపు ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది. శివనామస్మరణతో భక్తులు శ్రీగిరుల వెంట పాదయాత్రగా తరలివస్తున్నారు.
మహాశివరాత్రి పర్వదినం రోజున తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా భక్తులు తరలి వస్తారని, ఈ ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈఓ తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ దర్శన వేళల్లో మార్పులు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కాలినడకన వచ్చే భక్తులను గుర్తించి వారికి ప్రత్యేక కంకణాలను ఇస్తున్నట్లు చెప్పారు. అడుగడుగున ఈ టాయిలెట్స్, మంచినీరు, అన్నప్రసాదాలు, వైద్య సేవలతో పాటు అంబులెన్సులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఉదయం ప్రారంభంకానున్నాయి. ఉదయం 9.45 గంటల సమయంలో స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు మొదలుకానున్నాయి. శివ సంకల్పం, గణపతిపూజ, చండీశ్వర పూజ, కంకణపూజ, దీక్షా కంకణధారణ, రుత్విగ్వరుణం తదితర పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉదయం 10.30గంటలకు శైవ పుణ్యాహం, అఖండ స్థాపన, నవగ్రహ మండపారాధన, కలశ స్థాపన, పంచావరణార్చన, కలశార్చన, వాస్తుపూజ, వాస్తు హోమం, జపానుష్ఠాలు, పారాయణం, సాయంత్రం 5గంటలకు సాయంకాలార్చన, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ, రాత్రి 7 గంటలకు చండీశ్వర పూజ, భేరీపూజ, భేరీతాడన, త్రిశూల పూజలతో పాటు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ పూజ చేపట్టనున్నారు. అలాగే ధ్వజపటావిష్కరణ, బలిహరణ తదితర పూజాది కార్యక్రమాలు జరుగనున్నాయి.