వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు.. తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని
Secunderabad Bonalu: జాతర సందర్భంగా 250 సీసీ కెమెరాలు ఏర్పాటు
Ujjaini Mahankali Bonalu: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం నుంచే మహంకాళి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రేపు రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు, ఫలహార బండ్లపై ఊరేగిస్తారు. బొనాల సందర్భంగా ఆలయంలో 15రోజులు పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బోనాలు, ఓడి బియ్యం సమర్పణతో ఆలయం కిటకిటలాడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
శివసత్తులు,జోగినీలు అమ్మవారికి బోనం సమర్పించేందుకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు స్లాట్ కేటాయించారు. భక్తులు భద్రత కోసం ఆలయంలో 20 సీసీ కెమెరాలు ఉండగా.... జాతర సందర్బంగా మరో 250 సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆలయానికి వచ్చే భక్తుల వెహికిల్స్ పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడానికి ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని పోలీసులు సూచించారు. సికింద్రాబాద్వచ్చే మార్గంలో సైతం ట్రాఫిక్ ఉంటుందని తెలిపారు.
లష్కర్ బోనాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా నిర్వాహకులు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి బోనాలు సమర్పించే భక్తుల కోసం స్పెషల్ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ బాటా నుంచి సుభాష్‌రోడ్ మీదుగా ఓ క్యూ లైన్, ఎంజీ రోడ్ నుంచి మరో క్యూ లైన్‌ను ఏర్పాటు చేశారు. బోనాలతో వచ్చే భక్తులు నేరుగా ఈ రెండు క్యూ లైన్లలో వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించాలి.
క్యూలైన్లలో ఉన్న భక్తుల కోసం వాటర్ బోర్డు అధికారులు 7 లక్షల తాగునీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. ఆలయ ప్రాంగణంలోని 6 చోట్ల డ్రింకింగ్ వాటర్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. మహంకాళి పీఎస్, బాటా, అంజలి థియేటర్, రోచా బజార్ ప్రాంతాల్లో 4 మెడికల్ క్యాంప్‌లున్నాయి. 3 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు.