తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మధ్యాహ్నం దాటినా ఇంటినుంచి బయటకు రావడానికి జనం జంకుతున్నారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని 9 మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
జిల్లా కేంద్రాల వారీగా ఉష్ణోగ్రతల నమోదును చూస్తే నల్గొండ మినహా అన్నిచోట్లా గరిష్ట ఉష్ణోగ్రతలు 30డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. అధికంగా ఖమ్మం 32.6 డిగ్రీలు, నిజామాబాద్ 32.4డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 10.6 డిగ్రీలు, మెదక్‌లో 11.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక ఉదయం సమయంలో దట్టంగా పొగమంచు కమ్ముకుంటోంది. రహదారులు కనిపించకుండా కప్పేస్తోంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. మరోవైపు చలి నుంచి రక్షించుకోవడానికి ప్రజలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్ని దుస్తులు, ష్వెట్టర్లు ధరిస్తున్నారు. అయినప్పటికీ చలి తీవ్రత తగ్గకపోవడంతో గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా చలి మంటలు కాచుకుంటున్నారు.