Telangana: 6,7,8 తరగతుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్
Telangana: నేటి నుంచి ప్రారంభం కానున్న ప్రత్యక్ష బోధన * మార్చి 1లోపు తరగతుల ప్రారంభానికి అనుమతి
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి 6,7,8 తరగతులకు పాఠశాలల్లో క్లాసులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు 9 నుంచి ఆపైన తరగతులకు మాత్రమే విద్యాబోధన కొనసాగుతుండగా.. నేటి నుంచి 6,7,8 క్లాసుల విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి.
నేటి నుంచి మార్చి ఒకటో తేదీలోగా తరగతులను ప్రారంభించుకోవచ్చని తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అయితే పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులు కొవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇక పేరెంట్స్ పర్మిషన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. తరగతి గదుల్లో శానిటైజ్ చేస్తుండాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. టీచర్లు, విద్యార్థులు తప్పకుండా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఇక ఇప్పటివరకు 9, 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. ఫిబ్రవరి 1 నుంచి వీరికి క్లాసులు నిర్వహిస్తుండగా ప్రారంభంలో తక్కువ మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే ఈనెల 17వరకు ఆ సంఖ్య భారీగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో 65 నుంచి 75 శాతం మంది విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కింది తరగతులకు కూడా క్లాసులు నిర్వహించేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.