Medaram Jatara: ముగిసిన మేడారం మహా జాతర.. వనంలోకి వెళ్లిన సమ్మక్క, సారలమ్మ
Medaram Jatara: అమ్మవార్లను దర్శించుకున్న కోటి 40 లక్షల మంది
Medaram Jatara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర నాలుగు రోజుల పాటు కన్నుల పండువగా సాగి అత్యంత వైభవంగా ముగిసింది. జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క వన ప్రవేశంతో జాతర పరిసమాప్తమైంది. మేడారం గద్దెపై నుంచి చిలకలగుట్టకు సమ్మక్క చేరుకుంది. కన్నెపల్లికి సారలమ్మ, పూనుగొండ్లకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజు పయనమయ్యారు. ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించారు పూజారులు. డోలి వాయిద్యాలు, ఆదివాసి ఆచార సాంప్రదాయాలతో వన ప్రవేశం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
పగిడిద్దరాజు, గోవిందరాజులతో పాటు సమ్మక్క, సారలమ్మలను గద్దెలపై నుంచి దింపిన ఆదివాసీ పూజారులు ఆలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. లైట్లను ఆర్పివేసి.. వెన్నెల కాంతిలో గద్దెల వద్ద అమ్మవార్లకు తుది పూజలు నిర్వహించారు. శనివారం జాతర చివరిరోజు కావడంతో మహా ఘట్టం చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున మేడారానికి తరలివచ్చారు. ఏపీ, తెలంగాణతో పాటు ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం మేడారం తరలివచ్చిన భక్తులు.. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు.