Lal Darwaza Bonalu 2023: పాతబస్తీలో బోనాల పండుగ వైభవం.. అమ్మవారి ఆశీసులకోసం.. బోనాలతో తరలివచ్చిన మహిళలు
Lal Darwaza Bonalu 2023: వేపాకు తోరణాలు... డప్పుల చప్పుళ్లు... పోతురాజుల భీకర విన్యాసాలు... అమ్మవారి పూనకాలు...
Lal Darwaza Bonalu 2023: వేపాకు తోరణాలు... డప్పుల చప్పుళ్లు... పోతురాజుల భీకర విన్యాసాలు... అమ్మవారి పూనకాలు... లయబద్దమైన పదనర్తనలతో లాల్ దర్వాజా బోనాలు సందడిగా మారాయి. ఏ వీధిలో చూసినా...అమ్మవారి ఆశీసులకోసం.. బోనాలతో తరలివచ్చే వారే కన్పిస్తున్నారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి, ఆపద మొక్కులు తీర్చుకోడానికి మహిళలు బారులు తీరారు.శక్తి స్వరూపిణి అమ్మవారిని శక్తికొద్ధీ పూజించి నైవేద్య నివేదన చేయడం ఈ పండుగ ప్రత్యేకత. సామూహికంగా బోనాలు సమర్పించడం, కష్టాలను దూరంచేసి సుఖసౌభాగ్యాలను ప్రాప్తించాలని అమ్మవారిని వేడుకున్నారు.
ఆషాడమాసంలో ఆఖరి ఆదివారం... సింహవాహిణి దివ్యసన్నిధిని పుష్పాలంకరణతో శోభామానంగా తీర్చిదిద్దారు. ఆలయ సందర్శన ప్రత్యేక అనుభూతినిస్తోంది. అక్కాచెల్లెళ్లు... పిల్లాపాపలు.. అంతా ఒక్కటిగా పసుపు లోగిళ్లు.. బోనాల పండుగతో భాగ్యనగరానికి సరికొత్త శోభను తీసుకొచ్చింది.
ఆషాడమాసంలో శక్తి స్వరూపిణి అమ్మవారిని ఆరాధిస్తే సకల శుభాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తరతరాలు అమ్మవారిని ఆరాధించే క్రమం... తెలంగాణలో ఆషాఢబోనాల పండుగను రాష్ట్ర పండుగగా పరిగణించారు. అమ్మవారిని ఆరాధించి .. ఆశీస్సులు పొందేందుకు ప్రతికుటుంబ సభ్యులు ఏకమవ్వడం, కుటుంబ సమేతంగా అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు.
ఆషాడమాసంలో అమ్మవారిని ఆరాధించే సంస్కృతి, సాంప్రదాయాలు... బోనాల పండుగలో బావితరాలకు ప్రతియేటా గుర్తుచేస్తాయి.శక్తి స్వరూపిణులు... అక్కాచెల్లెళ్లుగా ఏడుగురు దేవతలు భాగ్యనగర పరిసరాల్లో వెలసి దశాబ్ధాలుగా పూజలు అందుకుంటున్నారు. ఒక్కోదేవతకు.. ఒక్కో వారం ఆరాధించేవిధంగా ఈ బోనాల పండుగను భాగ్యనగరం వేదికగా మారింది. గోల్కొండలో తొలి బోనంతో ప్రారంభమైన ఉత్సవాలు... సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవాన్ని సంతరించుకున్నాయి.
ఆషాడమాసంలో ఆఖరి ఆదివారం పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి బోనాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఈరోజు తెల్లవారు జామునుంచే సింహవాహిని అమ్మవారి సన్నిధి భక్తులతో సందడిగా మారింది. అర్థరాత్రి అభిషేకపూజలతో దివ్యతేజ స్వరూపిణి.. దివ్యాలంకార శోభితురాలై... భక్తుల్ని కటాక్షించేందుకు సిద్ధమయ్యారు. ఆలయాధికారులు కర్పూర నీరాజనాలతో సర్కారు హారతిచ్చారు. నైవేద్య నివేదన అనంతరం సర్వ దర్శనానికి అనుమతిచ్చారు.
ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పట్టువస్త్రాలను సమర్పిస్తారు. ఇవాళ బోనాలు సమర్పించేందుకు మహిళలు వేలాదిగా తరలివస్తారు. దీంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తనీకుండా.. ఆలయాధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.