కేటీఆర్ ఫామ్ హౌస్ కేసు నవంబర్ 16కు వాయిదా

Update: 2020-10-19 10:48 GMT

కేటీఆర్ ఫామ్ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు ఈ రోజు జరిపింది. ఈ కేసును వాదిస్తున్న న్యాయవాదులు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు వర్చ్యువల్ హియరింగ్ జరపాలని మెన్షనింగ్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ విచారణలో సీనియర్ న్యాయవాది ఢిల్లీ నుంచి కేటీఆర్ తరఫున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించేందుకు అనుమతించాలని కేటీఆర్ తరఫు న్యాయవాది తరుణ్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి తరుఫున విచారణకు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ న్యాయవాది రాజ్ పంజ్వాని హాజరయ్యారు. అదే విధంగా హైదరాబాద్ నుంచి సీనియర్ న్యాయవాది ఎస్ ఎస్ ప్రసాద్ హాజరయ్యారు.

కాగా ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి తరుఫున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదించేందుకు తనను అనుమతించాలని సీనియర్ న్యాయవాది రాజ్ పంజ్వాని కూడా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వీరి విన్నపాలను విని స్పందించిన న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసును విచారించడం సాధ్యం కాదని, భౌతిక విచారణకు కేసు లిస్ట్ అయినందువల్ల కోర్టుకు వచ్చి వాదిస్తే వింటామన్నారు హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్. ఎన్ జి టి ఆదేశాల్లో హైకోర్టు జోక్యం చేసుకోరాదని మధ్యంతర ఆదేశాలు ఉన్నందువల్ల కమిటీ విధులకు ఆటంకం కలుగుతోందని రాజ్ పంజ్వాని వివరించారు. సత్వరం కేసు విచారణ జరపాలని ఎన్ జి టి చెన్నై బెంచ్ ఆదేశాలను స్టే చేసినందువల్ల నిపుణుల కమిటీ విధులకు ఆటంకం కలుగుతోందని రేవంత్ రెడ్డి తరుఫు న్యాయవాది రాజ్ పంజ్వాని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కమిటీ తన పని జరిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

అనంతరం మరో సీనియర్ న్యాయవాది ఎస్ ఎస్ ప్రసాద్ ఈ కేసు కవర్డ్ మాటరని కోర్టుకు వివరించారు. హైకోర్టును పూర్తి స్థాయిలో భౌతిక విచారణకు అనుమతించడం పై నవంబర్ ఆరవ తేదీన ఫుల్ కోర్టు సమావేశం ఉందని ఆయన అన్నారు. ఈ కేసును పూర్తి స్థాయిలో ఫిజికల్ హియరింగ్ కు అనుమతి ఇస్తే వీడియో కాన్ఫరెన్స్ విచారణ ఉండదని చీఫ్ జస్టిస్ స్పష్టంచేశారు. భౌతికంగా వాదనలు జరిపేందుకు న్యాయవాదులు అందుబాటులో లేనందువల్ల కేసు విచారణ వాయిదా వేశారు. కేసు విచారణ కు ఎక్కువ సమయం పట్టదని వివరించారు. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 16కు వాయిదా వేశారు.

Tags:    

Similar News