Khammam Politics: కేసీఆర్ వ్యూహంతో ఒంటరైన పొంగులేటి
Khammam Politics: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రాజకీయాలు ఒక ఎత్తు అయితే ఖమ్మం జిల్లా రాజకీయాలే వేరు.
Khammam Politics: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రాజకీయాలు ఒక ఎత్తు అయితే ఖమ్మం జిల్లా రాజకీయాలే వేరు. రాష్ట్ర పొలిటికల్ ముఖ చిత్రంలో ఖమ్మం పాలిట్రిక్సే ఎప్పటికీ వేరుగానే ఉంటాయి. జిల్లాలో మొన్నటి వరకు కీలక నేతగా ఎదిగిన ఆయన ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. రాజకీయంగా ఒత్తిడి పెరగడంతో ఎటు వెళ్లాలో అర్థంగాక సతమతమవుతున్నారట. అయితే ఆ నేతను అధికార పార్టీ లైట్‌గా తీసుకోవడంతో ఆయన వెంట ఉన్న క్యాడర్ మాత్రం పార్టీ మారాలని పట్టుబడుతున్నారట. ఇంతకీ ఆ కీలక నేత ఎవరు..? ఎందుకు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు..?
పార్టీ మారాలనుకుంటున్న ఆయన మరెవరో కాదు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కొద్ది రోజులుగా అధికార పార్టీ బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. పార్టీలో ఉన్నా తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం ఇన్నాళ్లూ ఆయన అధికార పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఖమ్మం జిల్లాలో ఆయనకు కంచుకోటలాంటి క్యాడర్ ఉందనే ప్రచారం కూడా ఉంది. ఇన్ని రోజులు ఆయనకు మద్దతుగా..మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మద్దుతుగా నిలుస్తూ వచ్చారు. పొంగులేటి..తుమ్మల ఇద్దరూ అధికార పార్టీపై ఒత్తిడి తేవడానికి అనేక సమావేశాలు, సమ్మేళనాలు కూడా నిర్వహించారు. దీంతో వివాదం కాస్తా ముదిరి పాకాన పడింది. అధిష్టానానికి వ్యతిరేకంగా పావులు కదపడంతో గులాబీ బాస్ సీరియస్ అయ్యారనే ప్రచారం జరిగింది. దీంతో వారిద్దరిని కేసీఆర్ కాస్తా దూరం పెట్టారనే టాక్ విన్పించింది. ముఖ్యంగా పొంగులేటిపై సీఎం కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారట. దీంతో అధికార పార్టీ బీఆర్ఎస్‌లో ఇక ఉండడం వృధా అన్న ఆలోచనకు వచ్చిన పొంగులేటి సొంత పార్టీలో ఇమడలేక మరో పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో మంత్రి కేటీఆర్ పొంగులేటితో అనేకసార్లు సంప్రదింపులు జరిపినా వివాదం మాత్రం సద్దుమణగలేదు.
పొంగులేటిని ఎలాగైనా ఒంటరి చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే బుధవారంనాడు ఖమ్మం జిల్లాలో పొంగులేటి టార్గెట్‌గా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించారు. దీంతో వివాదం తారాస్థాయికి చేరడంతో పార్టీ ట్రబుల్ షూటర్ మంత్రి హారీష్ రావు రంగంలో దిగారు. తుమ్మలతో చర్చలు జరపి ఆయనను సైడ్ చేయడంతో మాజీ ఎంపీ పొంగులేటి ఒంటరిగా మిగిలిపోయారు. ఆ క్షణం దగ్గరి నుంచి పొంగులేటిని బీఆర్ఎస్ పార్టీ లైట్‌గా తీసుకుంది. కనీసం సభకు కూడా పొంగులేటిని ఆహ్వనించలేదు. దీంతో ఆయనతో మాట్లాడేందుకు పార్టీ నేతలు ఎవ్వరూ సుముఖత చూపించలేదు. దీంతో ఒంటరైన పొంగులేటి పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గత ఐదేళ్లుగా పొంగులేటిని నమ్ముకొని జిల్లాలో రాజకీయాలు చేస్తున్న నేతలు సైతం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు డుమ్మా కొట్టారు. పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కొత్తగూడెం జిల్లా చైర్మెన్ కోరం కనకయ్య, సత్తుపల్లి సీనియర్ నేత మట్ట దయానంద్ తోపాటు మరికొంత మంది నేతలు బహిరంగ సభకు దూరంగా ఉన్నారు. కేవలం పొంగులేటిని పార్టీ పట్టించుకోవడం లేదనే కోణంలో ఈ నేతలంతా పార్టీ బహిరంగ సభకు దూరంగా ఉన్నట్లు జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. పొంగులేటి ఇన్ని రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా పార్టీలో వివాదాలు నెమ్మదిగా సర్దుకుంటాయని అందరూ భావించారు. కానీ పార్టీ అధిష్టానమే పొంగులేటిని లైట్‌గా తీసుకోవడంతో..నిన్నటి వరకు ఓ లెక్క..ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా తయారైంది.
పొంగులేటి ఇప్పుడు ఎటువైపు వెళ్తారో అన్న అంశంకంటే..ఆయన వెంటనే పార్టీ వీడాల్సిన పరిస్థితిని బీఆర్ఎస్ సభ తీసుకొచ్చిన్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. సీఎం కేసీఆర్ రచించిన రాజకీయ వ్యూహంలో పొంగులేటి వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక పొంగులేటి తన రాజకీయ భవిష్యత్తు కంటే జిల్లాలో ఉన్న ఆయన క్యాడర్ భవిష్యత్తు కోసమైనా పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగానే ఇప్పటికే బీజేపీతో చర్చలు జరిపిన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ లేదంటే బీజేపీ వైపు చూస్తున్నట్లు కొందరు నేతలు చెప్పుకుంటున్నారు.
పొంగులేటి వివాదం ఖమ్మం జిల్లాలో సమసిపోయిన్నట్లే అని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. పొంగులేటిని పార్టీ నుండి వెలివేసిన్నట్లేనని కొందరు నేతలు బహిరంగంనే విమర్శలు చేస్తున్నారు. మంత్రి పువ్వాడనే నేరుగా విమర్శలు చేస్తుండడంతో టార్గెట్ ఫిక్స్ చేసిన్నట్లు జిల్లాలో చర్చ సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పొంగులేటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాల్సి ఉంది.