Khammam in Grip of Seasonal Diseases: తుమ్మినా.. దగ్గినా భయమే.. ఏది కరోనా? ఏది సీజనల్‌ జ్వరమో తేల్చుకోలేక సతమతం

Update: 2020-08-01 10:01 GMT

కాస్తంత ఒళ్ళు వేడెక్కిందంటే చాలు మదినిండా ఒకటే మదనం. ఒంటి లోగుట్టు తెలుసుకోవాలంటే భయం కమ్మెస్తోంది. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న వేళ కరోనా లక్షణాలు గుర్తుకొస్తే చాలు వెన్నులో వణుకుపుడుతోంది. సాదారణ జలుబు, జ్వరానికి కూడా కరోనా టెస్ట్ చేస్తే గాని వైద్యం అందని పరిస్థితితో జిల్లా వాసులు బిక్కుబిక్కుమంటున్నారు.

ఖమ్మం జిల్లాలో ఓ వైపు కరోనా వైరస్‌ విజృంభిస్తుండగా మరోవైపు సీజనల్‌ వ్యాధుల ముప్పు ముంచుకొస్తోంది. జులై, ఆగస్టు నెలల్లో వాతావరణ మార్పులు కారణంగా సీజనల్ జ్వరాలు రావడం సర్వ సాధారణం. అయితే కరోనా విజృంభనతో ఖమ్మం జిల్లాలో సాధారణ వైద్యం కూడా అందుబాటులో లేకుండా పోతుంది. ఎవరైనా దగ్గు, జలుబు, జ్వరంతో బాధ పడుతుంటే వారి వంక అందరూ విచిత్రంగా చూసే పరిస్థితి నెలకొంది. జ్వరం, దగ్గుతో వెళ్లినా ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది చూసే అనుమాన చూపులకు సగం జంకుతున్నారు. దీంతో తమకు జ్వరం వచ్చిందనే విషయం బయటకు చెప్పుకోలేని పరిస్థితితో ప్రజలు నలిగిపోతున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాధారణ జ్వరం, జలుబుతో బాధపడుతున్న వారు చాలా మంది మెడికల్‌ షాపులను ఆశ్రయిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లోనే ఆసుపత్రులకు వెళ్తున్నారు. అనుమానం వస్తే బాధితులను కరోనా వార్డుల్లోనే ఉంచుతున్నారు. పరీక్షల్లో నెగిటివ్‌గా వస్తే సాధారణ చికిత్సకు ఉపక్రమిస్తున్నారు. కరోనా టెస్ట్ ఇచ్చి ఇంటికెళ్లిన వారూ ఫలితాలు వచ్చే వరకు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలు అధికంగా ఉన్న ఉమ్మడి ఖమ్మంలో ఏటా జ్వరాలు తీవ్రంగా బాధిస్తుంటాయి. గ్రామాలకు గ్రామాలే మంచానపట్టిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు జ్వరం వచ్చినా అందరి మదిలో కరోనా వైరస్‌ మెదులుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో పాజిటివ్‌ కేసు వస్తే సంబంధిత ప్రాంతంలో ర్యాపిడ్‌ సర్వే నిర్వహించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. పాజిటివ్‌ వచ్చినా పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని పరీక్షించటం లేదు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Tags:    

Similar News