Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
Phone Tapping Case: జూబ్లీహిల్స్ పోలీసులకు సీఐడీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు లేఖ
Phone Tapping Case: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న సీఐడీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు. అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేయాలని తాను ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదని లెటర్ రాశారు. తనపై వస్తోన్న ఆరోపణలు, మీడియా లీకులతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు లేఖలో తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పోలీసుల చర్యలు ఉన్నాయంటూ లేఖలో రాసుకొచ్చారు.
కేసు దర్యాప్తులో ఎలాంటి సమాచారం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తాను క్యాన్సర్ వ్యాధితో పాటు తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్నాని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాకు రాలేనన్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్రయాణం వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. వీడియోకాన్ఫరెన్స్, టెలీకాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో ఉంటానని తెలిపారు. పోలీసులకు దర్యాప్తును పూర్తిగా సహకరిస్తానని అన్నారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇండియాకు వస్తానని లేఖ రాశారు.