మూడోసారి విజయం కోసం కేసీఆర్ కసరత్తు
CM KCR: *రాష్ట్రపతి ఎన్నిక వ్యూహంపై చర్చ
CM KCR: తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావడం కోసం గులాబీ బాస్ వేస్తున్న ఎత్తుగడలు ఏంటి? కేటీఆర్ చెబుతున్న దాని ప్రకారం వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక అంతా ప్రశాంత్ కిషోర్ చేతిలోనే ఉందా? ఇంతకు సర్వే రిపోర్ట్ లతో పీకే ఏం చేయబోతున్నాడు? గులాబీ బాస్ వరుసగా చేస్తున్న చర్చల మర్మం ఏంటి? కొత్త జాతీయ పార్టీ మనుగడ కోసం ఎలాంటి నినాదాన్ని ఎంచుకున్నారు?
టీఆర్ఎస్ కోసం పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్టులతో మరోసారి ప్రగతిభవన్‌కు వచ్చారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసిన పికే వరుసగా కేసీఆర్ తో సమావేశమవుతున్నారు. ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ , సీనియర్ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంతో అనేక కీలక అంశాలపై చర్చించినట్లు కారు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో ఐ ప్యాక్ టీం తెలంగాణలో విస్తృతంగా సర్వేలు చేసింది. నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు బలహీనమైన అభ్యర్థులు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఇలా అనేక అంశాలపై చేసిన సర్వే రిపోర్టులతో పీకే తుది డ్రాఫ్ట్ తీసుకుని కేసీఆర్‌ను కలిసినట్లుగా తెలుస్తుంది.
ఇటీవలే ఖమ్మం టూర్లో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చేది పీకేనేనని కేటీఆర్ స్వయంగా ప్రకటించిన ఒక్క రోజులోనే ఆయన ప్రగతి భవన్‌కు రావడం ఆసక్తి రేపుతోంది. ఇటీవల ప్రశాంత్ కిషోర్ బృందం కొన్ని నియోజకవర్గాల సర్వేలు పూర్తి చేశారు. గత నెల రోజులుగా మిగతా నియోజకవర్గాల సర్వేలు పూర్తి చేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితి ఎలా ఉంది..? అభ్యర్థుల వ్యవహార శైలి మారాలంటే ఏం చేయాలన్న అంశాలపై పీకే సలహాలు సూచనలు ఇచ్చారు అంటున్నారు. అదే సమయంలో జాతీయ రాజకీయాల విషయంలోనూ పీకే కొన్ని సూచనలు, సలహాలు కేసీఆర్‌కు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అవలంభించాలి అన్నదానిపై పీకే ఆలోచనలను కేసీఆర్ పంచుకున్నారనీ అంటున్నారు. ఓవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తో కలిసి పని చేయాలని భావించినా అది వర్కౌట్ కాలేదు. ప్రస్తుతానికి దేశంలో విపక్షాలు ఐక్యంగా ఉండే అవకాశం లేనందున.. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు టిఆర్ఎస్ దూరంగా ఉండటమే బెటరన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి తరుణంలో పీకే సలహా ప్రకారమే కెసిఆర్ నడుచుకుంటారని అంతా అంటున్నారు.
మొత్తానికి బీహార్‌లో జన్ సురాజ్ సొంత రాజకీయ పార్టీ ప్రారంభించిన పీకే వ్యక్తితంగా టీఆర్ఎస్‌కు మాత్రమే పని చేస్తున్నారు. ఇతర పార్టీలకు పని చేసేందుకు అంగీకరించలేదు. దీంతో తరచుగా కెసిఆర్ ప్రశాంత్ కిషోర్ సమావేశమవుతున్నారు.