MLC Kavitha: కవితకు ఎందుకు బెయిల్ రావడం లేదు?

MLC Kavitha: జూన్ 3 వరకు రిమాండ్ పొడిగింపు

Update: 2024-05-20 13:00 GMT

MLC Kavitha: మరోసారి కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుండటంతో అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు... జూన్ 3 వరకు రిమాండ్ పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తిహార్‌ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్‌ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. 

దిల్లీ లిక్కర్ స్కాం ఏంటి?

దిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోరుతూ కోర్టులు ఆశ్రయించారు.ఈ కేసుల్లో కవితకు బెయిల్ రాలేదు.అరెస్టై రెండు నెలలు దాటినా ఆమెకు బెయిల్ రాలేదు. కవిత బెయిల్ పిటిషన్లపై దర్యాప్తు సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కవితకు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టులను అభ్యర్ధిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. కవిత దాఖలు బెయిల్ పిటిషన్ ను మే 6న కోర్టు తిరస్కరించింది.

2021 వరకు దిల్లీలో ప్రభుత్వమే మద్యం విక్రయించేది. అయితే, దీన్ని ప్రైవేటుకు అప్పగించేందుకు 2021లో దిల్లీలోని ఆప్ సర్కారు కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది.ఈ కొత్త విధానం రూపకల్పనలో దిల్లీ ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోదియా ‘నిర్హేతుకంగా, ఏకపక్షంగా’ నిర్ణయాలు తీసుకున్నారని, మొత్తంగా ఈ కొత్త విధానంతో ప్రభుత్వ ఖజానాకు రూ.580 కోట్ల కంటే ఎక్కువే నష్టం జరిగిందని అప్పటి దిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ధిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు నివేదిక పంపారు.

కొంతమంది లిక్కర్ వ్యాపారులకు డిస్కౌంట్లు, లైసెన్సు ఫీజుల్లో మినహాయింపులు లాంటి మేలు చేసేందుకు వారి నుంచి ఆప్ నాయకులు ముడుపులు తీసుకున్నారని నివేదికలో ఆరోపించారు. ఈ రిపోర్టును మొదట కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించారు. ఈ వివాదంపై 2022 ఆగస్టులో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదుచేసింది.

కవిత పేరు ఎలా బయటకు వచ్చింది?

ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనలో మనీష్ సిసోదియా, అరవింద్ కేజ్రీవాల్‌లతోపాటు కవితకు కూడా ప్రమేయముందని మొదట బీజేపీ నాయకులు ఆరోపణలు చేశారు. దిల్లీ మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ సిర్పా మొదట కవిత పేరును ప్రస్తావించారు. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ నాయకులూ తరచూ ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు.

ఈ కేసులో విట్‌నెస్‌గా హాజరుకావాలని 2022 డిసెంబరులో కవితకు ఈడీ సమన్లు పంపింది. ఏడాదిన్నర విచారణ అనంతరం 2024 మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో కవిత పాత్రపై ఈడీ స్పందిస్తూ.. ‘‘దిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో కవిత అక్రమాలకు పాల్పడ్డారు. ఆప్ నాయకులు పొందిన రూ.100 కోట్లలో కవిత ప్రమేయముంది. సౌత్ గ్రూపు ప్రతినిధిగా ఆమె వ్యవహరించారు. లిక్కర్ హోల్‌సేల్ డీలర్ల నుంచి వచ్చిన లాభాలను కవిత, ఆమె అసోసియేట్స్ పంచుకున్నారు’’ అని ఆరోపణలు చేసింది.

బెయిలు ఎందుకు రావడం లేదు?

ఈడీ అరెస్టు చేసిన అనంతరం కవితను దిల్లీకి తరలించారు. జ్యుడీషియల్ కస్టడీలోనున్న ఆమెను ఇదే కేసులో 2024 ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. అక్రమ నగదు చెలామణీ నిరోధక చట్టం (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ - పీఎంఎల్ఏ) కింద కవితపై ఆరోపణలు మోపారు. పీఎంఎల్‌ఏ కేసుల్లో దర్యాప్తు సంస్థ వ్యతిరేకిస్తే సదరు వ్యక్తికి బెయిలు రావడం దాదాపుగా అసాధ్యం. బెయిలుకు సంబంధించి పీఎంఎల్‌ఏలో సెక్షన్ 45లో రెండు నిబంధనలు ఉన్నాయి. బెయిలు అభ్యర్థనపై తమ అభిప్రాయం చెప్పేందుకు లేదా దీన్ని వ్యతిరేకించేందుకు మొదటగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు అవకాశం ఇవ్వాలనేది దీనిలో మొదటి నిబంధన. అయితే, ఒకవేళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ బెయిలు అభ్యర్థనను వ్యతిరేకిస్తే, ఆ నిందితుడు బెయిలుపై వెళ్లినప్పుడు మళ్లీ ఆ నేరం చేయడని లేదా కేసును ప్రభావితం చేయడని కోర్టు నిర్ధారించుకోవడమనేది రెండో నిబంధన. ప్రస్తుత కేసులో కవిత బెయిలు అభ్యర్థనలను పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఆమె బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఆరోపిస్తున్నారు.

మహిళలకు మినహాయింపు ఉంటుందిగా?

పీఎంఎల్‌ఏ కేసుల్లో ఒక మినహాయింపు ఉంటుంది. ‘‘ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి 16 ఏళ్లలోపు వ్యక్తి అయినా లేదా మహిళ అయినా లేదా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా బెయిలు ఇవ్వొచ్చు. అయితే, దీనికి ప్రత్యేక కోర్టు అనుమతి అవసరం’’ అని ఆ మినహాయింపులో పేర్కొన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని మహిళలు, మైనర్లకు ఉండే మినహాయింపుల్లానే ఈ మినహాయింపు పనిచేస్తుంది. ఆ మినహాయింపును కింద కవితకు బెయిలు ఇవ్వాలని ఏప్రిల్ 8న కవిత తరఫున వాదించిన అభిషేక్ మను సింఘ్వి చెప్పారు. అయితే, దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు స్పందిస్తూ.. ‘‘ఆమెమీ ఇంటికి పరిమితమయ్యే గృహిణి (హౌస్‌హోల్డ్ లేడీ) కాదు. ఆమెకు ఈ మినహాయింపు కింద అవకాశం ఇవ్వకూడదు’’ అని వాదించారు. దీనిపై జడ్జి స్పందిస్తూ.. ‘‘గృహిణి లేదా మహిళా వ్యాపారవేత్త లేదా ప్రముఖురాలు.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా రాజ్యాంగంలో నిబంధనలు ఉండవు’’ అని చెప్పారు.

మరి తిరస్కరణ ఎందుకు?

కవిత బెయిల్ పిటిషన్ పై మే 6న దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుత కేసులో నిందితురాలు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని జడ్జి కావేరీ బవేజా అభిప్రాయపడ్డారు. ‘‘కవిత విద్యావంతురాలు, సమాజంలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెను ‘వల్నరబుల్ ఉమన్’గా భావించి మినహాయింపు ఇవ్వలేం’’ అని జడ్జి స్పష్టంచేశారు. అంతేకాదు ‘‘కోర్టు ముందున్న సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం ఈ కేసులో ఆధారాలు లేకుండా చేసేందుకు తన ఫోన్లను కవిత ఫార్మాటింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి’’ అని జడ్జి చెప్పారు.కవిత బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చారు.

Tags:    

Similar News