కామారెడ్డి సీఐ జగదీష్ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. క్రికెట్ బెట్టింగ్ విషయంలో సీఐ జగదీష్ లంచం డిమాండ్ చేశాడన్న ఆరోపణలు రావడంతో పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు సీఐ ఇంటితో పాటు ఆయన కార్యాలయంలో సోదాలు జరిపారు. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
బాన్సువాడకు చెందిన బత్తుల సుధాకర్ క్రికెట్ బెట్టింగ్ విషయంలో పోలీసులకు చిక్కాడు. ఇదే అదునుగా భావించిన సిఐ జగదీష్ సుధాకర్‌ను విడుదల చేయడానికి 5 లక్షలు డిమాండ్ చేశాడు. మొదటి విడతగా లక్ష 39 వేలు ముట్టజెప్పిన సుధాకర్ మిగతా డబ్బులు బయటకు వచ్చాక ఇస్తానని చెప్పాడు. దీంతో అతనికి సీఐ స్టేషన్ బెయిల్ ఇప్పించాడు. మిగతా డబ్బుల కోసం సుధాకర్ కు సీఐ ఫోన్ చేయగా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో నిన్న నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో సీఐ ఇంట్లో సోదాలు నిర్వహించారు.
క్రికెట్ బెట్టింగ్ గురించి సీఐ జగదీష్‌కు ఓ మొబైల్ షాప్‌లో పని చేస్తున్న సృజయ్ అనే వ్యక్తి సమాచారం ఇచ్చాడని తెలుసుకున్న అధికారులు వారిద్దరినీ ఒకేచోట విచారించారు. విచారణలో కీలక సమాచారం సేకరించిన ఏసీబీ సీఐ జగదీష్, సృజయ్ లను అరెస్ట్ చేశారు. సీఐ అరెస్టుతో అవినీతి అధికారుల్లో టెన్షన్ పట్టుకుంది. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ఇప్పటికే కొందరు బెట్టింగ్ రాయుళ్లు సీఐ జగదీష్ కు లక్షల్లో ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. బెట్టింగ్ విషయమే కాకుండా జిల్లా కేంద్రంలో జరుగుతున్న లక్కీ డ్రా స్కీములు, బీర్షబా లాంటి స్కీము విషయంలో సీఐపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.