TSPSC: ఉద్యోగాలు ఇచ్చేది తక్కువ.. ఫీజులు వసూలు చేసేది ఎక్కువ
TSPSC: గత 6 ఏళ్లలో అప్లికేషన్ల ఫీజుల రూపంలో ఒకటి రెండు కోట్లు కాదు ఏకంగా 84 కోట్ల రూపాయలను TSPSC వసూలు చేసింది.
TSPSC: ఉద్యోగాలు ఇచ్చేది తక్కువ, ఫీజులు వసూలు చేసేది ఎక్కువ. ఇది TSPSC తీరు. గత 6 ఏళ్లలో అప్లికేషన్ల ఫీజుల రూపంలో ఒకటి రెండు కోట్లు కాదు ఏకంగా 84 కోట్ల రూపాయలను TSPSC వసూలు చేసింది. అప్లికేషన్ ఫీజుల రూపంలో వచ్చిన డబ్బులనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తుంది. అప్లికేషన్ ఫీజుల రూపంలో వసులైన 84 కోట్ల రూపాయల్లో 72 కోట్ల 45 లక్షల రూపాయలను సిబ్బందికి జీతాలుగా ఇచ్చింది. సమాచార హక్కు చట్టంలో TSPSC పైసా వసూల్ బయటపడింది.
ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువరించినప్పుడు TSPSC అప్లికేషన్ ఫీజును భారీగా పెడుతోంది. లక్షలాది మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం అప్లయి చేసుకుంటారు. ఒక్కోసారి ఒక్క ఉద్యోగానికి కూడా లక్షకు పైగా దరఖాస్తులు వస్తాయి. గత 6 ఏళ్లలో అప్లికేషన్ ఫీజుల రూపంలో TSPSCకి 84 కోట్ల రూపాయలు వచ్చాయి. ఏటా ప్రభుత్వం TSPSC ఉద్యోగుల జీతభత్యాలు, ఆఫీసు నిర్వహణ కోసం బడ్జెట్ లో నిధులు కేటాయిస్తోంది. ప్రభుత్వం కేటాయించే డబ్బులు సరిపోకపోవడంతో అప్లికేషన్ రూపంలో వచ్చిన ఫీజుల డబ్బులనే జీతాలుగా చెల్లిస్తోంది. గత 6 ఏళ్లలో ఫీజుల రూపంలో 84 కోట్లు వసూలు కాగా, ఇందులో 72 కోట్ల 45 లక్షల రూపాయలు సిబ్బందికి జీతాలుగా ఇచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త గంగాధర్ కిషోర్ TSPSC కి దరఖాస్తు ఇచ్చారు. అప్లికేషన్ ఫీజుల రూపంలో గత 6 ఏళ్లలో వసూలైన డబ్బులు వివరాలు, ఖర్చుల వివరాలను TSPSC వెల్లడించింది. TSPSC పైసా వసూల్ పై నిరుద్యోగులు లబోదిబో మంటున్నారు. వచ్చే నోటిఫికేషన్లలో అప్లికేషన్ ఫీజు తగ్గించాలని కోరుతున్నారు.