Nagarjunasagar Bypoll: సాగర్‌ ఉపఎన్నికలో అభ్యర్ధిని బరిలో దించే ఆలోచనలో జనసేన

Nagarjunasagar Bypoll:నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ఆసక్తిని రేపుతోంది.

Update: 2021-03-27 15:35 GMT

పవన్ కళ్యాణ్ ఫైల్ ఫోటో 

Nagarjunasagar Bypoll: నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ఆసక్తిని రేపుతోంది. బరిలో దిగుతున్నఅభ్యర్ధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పార్టీల వ్యూహం మారుతోంది. తాజాగా జనసేనాని కూడా ఈ ఉప ఎన్నికపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

నాగార్జునసాగర్ ఉప‌ఎన్నిక రోజుకో మలుపు తీసుకుంటోంది. ఎన్నికకు సమయం దగ్గర పడుతోన్నకొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నిజానికి సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి పేరును ఖరారు చేసింది. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు.

టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఇంకా డైలమాలో ఉన్నాయి. జానారెడ్డి వంటి నేతను ఢీకొట్టగల నాయకుడి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాయి. బరిలో ఎవరిని దింపాలనే విషయంలో తర్జనభర్జన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన కూడా తమ అభ్యర్ధిని ఎన్నికల బరిలో నిలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సాగర్‌ ఎన్నిక కోసం ఓ కమిటీని కూడా పవన్‌ కళ్యాణ్ నియమించారనే చర్చ జరుగుతోంది. ఈ అంశం ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఏపీలో మిత్ర పక్షాలుగా ఉన్న బీజేపీ, జనసేనలు తెలంగాణలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. భిన్న వ్యూహాలతో ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమౌతున్నట్లు కనిపిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో‌ బీజేపీ నేతల కోరిక మేరకు జనసేన పోటీ నుంచి తప్పుకుంది‌. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం జనసేన క్యాడర్ బాగానే కష్టపడింది. అయితే గ్రేటర్ ఎన్నికల్లో సహకరించిన తమను తెలంగాణ బీజేపీ నేతలు పదే పదే అవమానిస్తున్నారని స్వయంగా పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ అభ్యర్థి, పీవీ కూతురు వాణీదేవికి పవన్ మద్దతు ప్రకటించారు. తాజాగా నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో కూడా తమ అభ్యర్ధిని బరిలో దింపాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నాగార్జునసాగర్‌‌లో జనసేన పోటీ చేస్తే ఎస్టీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపుతారనే వాదన వినిపిస్తోంది.

Tags:    

Similar News