యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో పవన్ భరోసా యాత్ర.. చెక్కుల పంపిణీ...
Pawan Kalyan: జన సైనికులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి...
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ భరోసా యాత్ర యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలో సక్సెస్ అయింది. ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు కార్యకర్తలకు భీమా చెక్కులు అందించారు. ఏపీ రాజకీయాలకే పరిమితం కాకుండా తెలంగాణలో బరిలో ఉంటామన్న సంకేతాలిచ్చారు. ఎన్నికలెప్పుడు వచ్చిన తమదైన ముద్ర వేయడం ఖాయమన్నారు. అధికారం కోసం కాకుండా అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటుపడతామన్నారు. ఇక జనసైనికులు, అభిమానులు అడుగడునా బ్రహ్మరధం పట్టారు.
హైద్రాబాద్ నుంచి ప్రారంభమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా యాత్ర 12గంటల 30 నిమిషాలకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌట్ ప్పల్ మండలం లక్కారం చేరుకుంది. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పార్టీ క్రియాశీల కార్యకర్త కొంగరి సైదులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి 5లక్షల భీమా చెక్కును అందించి వారి కుటుంబ నేపధ్యం గురించి అడిగి తెల్సుకున్నారు. ముగ్గురు పిల్లల చదువు, వైద్యానికి అయ్యే ఖర్చులకు జనసేన తరుపున అండగా ఉంటామని భరోసా కల్పించారు. కోదాడలో మరో జనసేన కార్యకర్త శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షల భీమా చెక్ అందించారు. కోదాడలో భారీగా అభిమానులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కు ఘనస్వాగతం పలికారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాల్చుతూ క్రేన్ లతో గజమాలను వేస్తూ తమ అభిమానం చాటుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీకీ సిద్దమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే పరిమిత పాత్ర పోషించాలని భావిస్తున్నామన్నారు. అట్టడుగు వర్గాల నుంచి నాయకులు ఉన్నత స్ధానాలకు ఎదగాలన్నారు. ప్రతి జిల్లాలో జనసేన నాయకులు పర్యటించి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ఇరవై శాతం నియోజవర్గాల్లో పోటీ చేయ్యాలనుకుంటన్నామన్నారు. త్వరలో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.
కొమరబండ వద్ద పవన్ కళ్యాణ్ భరోసా యాత్రలో అపశృతి దొర్లింది. కాన్వాయ్ లోని కారు ఢీ కొని ఇద్దరు యువకులు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఖమ్మం తరలించారు. మొత్తంగా పవన్ భరోసా టూర్ సక్సెస్ తో జనసేన కార్యకర్తల్లో నూతన ఉత్తేజం సంతరించుకుంది