మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోమవారం తమ ముందు హాజరుకావాలని ఆదేశాలు
* మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారుల ఫిర్యాదు.. తనిఖీలకు సహకరించడం లేదని కంప్లైంట్
Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. రెండు రోజులుగా కొనసాగిన తనిఖీలు ఇవాళ ఉదయం పూర్తయ్యాయి. తర్వాత మంత్రి మల్లారెడ్డికి నోటీసులు జారీ చేసిన అధికారులు సోమవారం తమ ముందు హాజరుకావాలని ఆదేశించారు. మరోవైపు మల్లారెడ్డి నివాసం దగ్గర రాత్రంతా హైడ్రామా చోటు చేసుకుంది. ఇటు ఐటీ అధికారులు, అటు మల్లారెడ్డి పరస్పరం పోలీసులకు కంప్లైంట్ చేశారు. అధికారులు తప్పుడు సమాచారంతో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని తన కుమారుడితో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. రత్నాకర్ అనే ఐటీ అధికారిపై బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. అదే సమయంలో మంత్రి మల్లారెడ్డి తీరుపై ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు.
తనిఖీలకు సహకరించడం లేదని కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఆయన ల్యాప్‌టాప్‌ను పరిశీలిస్తున్న సమయంలో తమ నుంచి లాక్కున్నారని తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని కంప్లైంట్‌లో ఆరోపిచారు. ఇటు ఆస్పత్రిలో ఉన్న తన కుమారుడితో బలవంతంగా సంతకం చేయించుకున్నారని ఐటీ అధికారులు తమని చిత్రహింసలకు గురిచేస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. మెడికల్ కాలేజీకి సంబంధించి అన్ని అబద్దాలు రాశారని చెప్పుకొచ్చారు. తన కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా బలవంతంగా సంతకం చేయించుకున్నారని ఆరోపించారు. ఐటీ సోదాల్లో ఒక్క రూపాయి కూడా దొరకలేదన్న మంత్రి మల్లారెడ్డి తన కుమారుడు సంతకం చేసిన పేపర్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.