చందానగర్ పరువు హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం ఎంత?

Update: 2020-09-30 07:00 GMT

పరువు హత్య కేసులో కిడ్నాప్ చేయబడి దారుణ హత్యకు గురైనా హేమంత్ కేసులో పోలీసులు సరిగ్గా స్పందించలేదా..?. అత్యవసర సమయంలో డయల్ హండ్రెడ్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదా..?. పట్టపగలే ఓ వ్యక్తిని ఇంత ఈజీగా కిడ్నాప్ చేయడం భద్రతా డొల్లతనాన్ని తేటతెల్లం చేసిందా..?. అడుగడుగునా సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్తున్న పోలీసులు దర్యాప్తులో వాటిని ఎందుకు సకాలంలో ఉపయోగించుకోలేకపోయారు..?.

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మధ్యాహ్నం హేమంత్, అవంతిలతో మాట్లాడాలంటూ అవంతి తరపు బంధువులు వారు అద్దెకు ఉంటున్న గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీ నుంచి తీసుకెళ్లారు. గోపన్‌పల్లి నుంచి కారు లెఫ్ట్ టర్నింగ్ తీసుకోవటంతో సందేహం వచ్చిన అవంతి కారులో నుంచి బయటకు దూకి హేమంత్‌ను కూడా బయటకు లాగింది.

ఘటన సమయంలో అక్కడ ఉన్న ఏ ఒక్కరూ పోలీసులకు ఫోన్‌ చేయడానికి ప్రయత్నం చేయకపోగా ఫోన్లలో రికార్డు చేస్తూ చోద్యం చూశారు. అంత సేపు గొడవ జరిగినా పోలీసులకు సంబంధించిన ఏ ఒక్క గస్తీ వాహనం అక్కడకు చేరుకోలేదు. మరోవైపు నిందితుల నుంచి అతి కష్టంమీద తప్పించుకున్న హేమంత్ తెల్లాపూర్‌ రోడ్డువైపు పరుగులు తీశాడు. దీంతో అప్పటికే కిరాయి హంతకులు అవంతి మేనమామ కారులో చేజ్‌ చేసి పట్టుకున్నారు.

పట్టపగలు హేమంత్‌ కిడ్నాప్ జరిగినా ఎవరూ ఆపలేకపోయారు. మధ్యాహ్నం 3గంటల 50 నిమిషాల ప్రాంతంలో హేమంత్‌ తండ్రి డయల్‌ 100కు కాల్‌చేస్తే 4.30 గంటలకు పెట్రోలింగ్‌ వాహనంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వీరొచ్చే 10 నుంచి 15 నిమిషాల ముందే హేమంత్‌ను కిడ్నాప్‌ చేసి వాహనంలో తీసుకెళ్లారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అయితే గోపన్‌పల్లి తండా చౌరస్తా వద్ద 11 మందిని అదుపులోకి తీసుకొని, అవంతి, ఆమె అత్తమామలను పీఎస్‌కు తరలించారు. కానీ హేమంత్ కారులో ఎటు తీసుకెళ్లారన్న విషయంపై మాత్రం పోలీసులు సీరియస్‌గా దృష్టిపెట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నిందితులు హేమంత్‌ను 3 గంటలు కారులోనే తిప్పారని సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించి పీఎస్‌లకు కానీ, గస్తీ బృందాలను అలెర్ట్ చేసినా హేమంత్‌ను కాపాడేవారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హేమంత్‌ను కారులో తీసుకెళ్లిన నిందితులు పోలీసులకు పట్టుబడ్డ నిందితులకు ఫోన్ చేస్తేనే హత్య విషయం బయటపడిందని సమాచారం. ఏదేమైనా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా వాటిని ఉపయోగించుకోకపోవటం పట్ల విమర్శలు వ్యక్తమౌతున్నాయి. హేమంత్ విషయంలో పట్టపగలు కిడ్నాప్ జరిగినా దానిని నిలువరించలేకపోగా ఘటన జరిగిన వెంటనే స్పందించి బాధితున్ని కాపాడలేకపోయారనే ఆరోపణలున్నాయి. మొత్తం మీద పోలీసింగ్‌లోని లోపాలను పరువు హత్య ఘటన తేటతెల్లం చేసిందనే విమర్శలు గట్టిగానే విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News