సినిమావాళ్లేనా రాజకీయ నాయకులు విరాళాలు ఇవ్వరా? పారిశ్రామికవేత్తలు డొనేషన్స్ విధిలించరా? పోగుపడిన ధనంలోంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు పైసా విదిల్చరా? ఇవీ మొన్న పవన్ కల్యాణ్ సంచలన కామెంట్లు. ఎన్నడూలేనంతగా, అదీ కూడా తెలంగాణ నేతలపై పవన్ చేసిన ఈ వ్యాఖ్యల వెనక అసలు కథేంటి? ఓ మంత్రినుద్దేశించే ఈ విమర్శలు చేశారా?
హైదరాబాద్ వరదల విరాళాలపై, జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలు ఇంకా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సినిమా వాళ్ళ కంటే రాజకీయ నేతలు, మౌలికసదుపాయాల కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గరే ఎక్కువ డబ్బులు ఉంటాయని ఘాటు కామెంట్స్ చేశారు పవన్. అంతేకాదు, ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసే నేతలు, ఇప్పుడు రాజకీయానికి పెట్టుబడి అనుకుని, డబ్బు బయటకు తియ్యాలన్నారు. విరాళాలు అనగానే, ఎప్పుడూ సినిమావారే గుర్తొస్తారని, కానీ సినిమా వాళ్లకంటే, పొలిటికల్ లీడర్స్, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గరే ఎక్కువ డబ్బుంటుందన్న పవన్, ఇలాంటి బడాబడా ధనవంతులు ముందుకు రావాలన్నారు. గతంలో ఎన్నడూలేని రీతిలో తెలంగాణలో అత్యంత కీలకంగా మారిన మౌలిసదుపాయాలు, రియల్ ఎస్టేట్ కంపెనీల గురించి పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించటం చర్చనీయాంశంగా మారింది. పవన్ ఘాటు వ్యాఖ్యలకు, ఓ మంత్రిగారి ఫోన్ కాల్స్ ఒత్తిడే కారణమన్న మాటలూ వినపడ్తున్నాయి.
టాలీవుడ్ ప్రముఖ హీరో ప్రభాస్ హైదరాబాద్ వరద బాధితుల సాయం కోసం కోటిన్నర రూపాయలు ప్రకటించారు. ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, కోటి రూపాయల లెక్కన సీఎంఆర్ఎఫ్‌కు ఇస్తున్నట్టు చెప్పారు. నాగార్జున, ఎన్టీఆర్‌లు యాభై లక్షలు ప్రకటిస్తే, విజయదేవరకొండ పది లక్షలు ఇచ్చారు. మరికొంత మంది దర్శకులు కూడా తమకు తోచిన సాయం ప్రకటించారు. ఇంకా ప్రకటించాల్సిన వారు చాలామంది ఉన్నారు. వాళ్లు ప్రకటిస్తారో లేదో కూడా తెలియదు. అయితే, ఓ తెలంగాణ మంత్రి ఏకంగా, సినిమా హీరోలు, నిర్మాతలు, దర్శకులకు ఫోన్‌లు చేసి మరీ, విరాళాలు ప్రకటించాలని చెబుతున్నారట. పెద్ద మొత్తంలో విరాళాలివ్వాలని ఒత్తిడి సైతం తెస్తున్నారట. ఓ మంత్రి నేరుగా రంగంలోకి దిగి, ఫోన్లు చేయటం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ వద్దకు చేరటంతోనే, ఆయన ఈ అంశంపై ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.
వరద సాయం ప్రకటిస్తే తీసుకోవాలి కానీ, ఇలా ఫోన్లు చేసి కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేయటం ఇదే మొదటిసారి అని వ్యాఖ్యానిస్తున్నారు సినీ ప్రముఖులు. సాయం అన్నది ఎవరికి తోచినట్లు వారు చేస్తారు. కానీ సాయం ఎంత చెయ్యాలో ఫిక్స్ చేస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఏ ఆపద వచ్చినా, టాలీవుడ్ తన వంతు సాయం చేస్తూనే ఉందని, కానీ ఇలా ఒత్తిళ్లు చేయటం సరికాదన్నట్టుగా పవన్ కామెంట్ చేశారు. ఏడెనిమిది నెలలుగా కరోనా కారణంగా పరిశ్రమ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అయినా ఇలాంటి పరిస్థితుల్లో, పెద్దమొత్తంలో విరాళాలు ఇవ్వాలంటూ, బెదిరింపు ధోరణిగా మాట్లాడటం భావ్యంకాదంటున్నారు సినీ ప్రముఖులు. ఒకవేళ సాయం చెయ్యకపోతే, కక్షసాధింపులకు దిగుతారు అన్నట్టుగా ఆ మంత్రిగారి మాటలున్నాయంటున్నారు. సదరు మంత్రినుద్దేశించే పవన్ అలాంటి వ్యాఖ్యలు చేశారంటున్న పరిశ్రమ పెద్దలు, జనసేన అధినేత కామెంట్లను సమర్థిస్తున్నారట.
అయితే, మినిస్టర్‌ను టార్గెట్ చేస్తూ, పవన్ చేసిన వ్యాఖ్యల వెనక రాజకీయ కోణమూ వుందంటున్నారు పరిశీలకులు. త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో, బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని, అందుకే టీఆర్ఎస్‌ను, గ్రేటర్ మంత్రిని పవన్ ఇన్‌డైరెక్టుగా లక్ష్యం చేసుకున్నారని అంటున్నారు. సినిమా వాళ్లను విరాళాలు అడగడం, ఇవ్వడం సాధారణ విషయమే అయినా, గ్రేటర్ పోరు నేపథ్యంలోనే, పవన్ అలాంటి కామెంట్స్ చేశారని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ప్రకంపనలు సృష్టిస్తున్న పవన్ వ్యాఖ్యలపై, ఇలా రకరకాల మాటలు వినపడ్తున్నాయి.