ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నయా వీరప్పన్‌లు

Update: 2020-08-08 11:51 GMT

Is Adilabad forests in threat of perpetrators: అడవులను మింగిన వీరప్పన్‌లు. రియల్‌ ఎస్టేట్ మోసాల భూబకాసురులు. గుట్కా దందాతో కోట్లు కొల్లగొట్టిన ఘనాపాటీలు. అంతకంటే ఎక్కువ సంపాదించడానికో, అక్రమ రవాణా సర్రున సాగడానికో, వీళ్లందరూ కలిసి కొత్త అవతారమెత్తారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో, ఆ అవతార మూర్తుల కథ మీరే చూడండి.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కొందరు ప్రజాప్రతినిధులు పేరు మోసిన అటవీ స్మగ్లర్లు. అడవులను కొల్లగొట్టి కోట్లు పోగేసుకున్న వీరప్పన్‌లు. స్మగ్లర్లుగా రాటుదేలి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నేరగాళ్లు. కొందరు జడ్పీటీసీలుగా, మరికొందరు ఎంపిపిలుగా పాలిస్తున్నారు. ఒక మున్సిపాలీటీకి కలప స్మగ్లర్ వైస్‌ చైర్మన్‌గా అవతారమెత్తితే, మరొక మున్సిపాలీటీలోనూ ఇలాంటి బకాసురుడే వైస్ చైర్మన్ పీఠమెక్కారు. నేరాలే అర్హతలుగా, కేసులే రెడ్‌కార్పెట్‌గా ప్రజాప్రతినిధుల సభలో కాలుమోపారు.

మంచిర్యాల జిల్లాలో ఓ గుట్కా స్మగ్లర్ జడ్పీటీసీగా ఎన్నికయ్యాడు. ఆయన పేరుకు జడ్పీటీసీగా ఉన్నా, ఎమ్మెల్యే కంటే ఎక్కువ. మంత్రి స్థాయికి దగ్గర. అలా వుంటుందట ఆయనగారి వ్యవహారం. ఎంతైనా అక్రమ గుట్కా తిన్న బలుపు కదా అంటున్నారట మిగతా జడ్పీటీసీలు. భవిష్యత్‌లో కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే, తానే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనంటూ, ఫ్యూచర్‌టెన్స్‌నూ ఒక చూపు చూసేశారట సదరు జడ్పీటీసీ. ఇదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక మున్సిపల్ చైర్మన్, రియల్ వ్యాపారంలో ప్రజలను నిండా ముంచితే, మరొకరు సర్కారు బియ్యాన్ని బొక్కేశాడన్న ఆరోపణలు మీదేసుకున్నాడు. పేదలకు చేరాల్సిన బియ్యపు గింజలను మధ్యలోనే ఎలుకల్లా మింగేశాడట ఆయనగారు.

మొన్నటి వరకు అక్రమార్కుల్లా చెలామణి అయిన నేతలు, ఇప్పుడు నీతులు చెప్పడం చూసి నవ్వుకుంటున్నారట జనం. ఇదే కాబోలు రాజకీయమంటూ నోరెళ్లబెడుతున్నారట. డబ్బుంటే చాలు, రాజకీయాల్లో ఏదైనా సాధించొచ్చని, వీళ్లు నిరూపిస్తున్నారని ప్రజలు రగిలిపోతున్నారు. అలాగని రాజకీయాలకు ముందు మాత్రమే వీరు దందా చెయ్యలేదు. పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చాక ఫుల్‌స్టాప్ పెట్టలేదు. మరింత రెచ్చిపోతూ, అక్రమాలు చేస్తున్నారట. స్మగ్లింగ్ దందాలతో కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారట. అడిగేవాడు లేరు. నెత్తిమీద ప్రజాప్రతినిధి అన్న బోర్డు వుంది. ఈ అక్రమార్కులు ఒకే పార్టీకే పరిమితం కాదు. కాంగ్రెస్, టీఆర్ఎస్, చివరికి బీజేపీలోనూ చాలామంది వున్నారట. అయితే తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు, భవిష్యత్‌లో ఎమ్మెల్యేలు కావాలని కలలు కంటున్నారట. అందుకు తగ్గట్టుగా అంగ, అర్థ బలాన్ని పెంచుకుంటున్నారట. ఇదే స్థానిక ఎమ్మెల్యేలకు అస్సలు నచ్చడం లేదట. ఇలాగే వదిలేస్తే పాన్‌పరాగ్‌ నేతలు, తమ సీటుకే స్పాట్‌ పెట్టేస్తారని అలర్టయ్యారట. వారిని ఎక్కడ వుంచాలో, అక్కడే వుంచాలని స్కెచ్‌ వేస్తున్నారట.

Full View



Tags:    

Similar News