Telangana: తెలంగాణలో ఇంటర్ పరీక్షలపై గందరగోళం
Telangana: కరోనాతో విద్యా వ్యవస్థ అతలాకుతలం
Telangana: తెలంగాణలో ఇంటర్ పరీక్షలపై గందరగోళం నెలకొంది. లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం అయోమయంలో పడింది. గతంలో టీఎస్ ఇంటర్ బోర్డు కారణంగా ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారు. అది మరువకముందే కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థను అతలాకుతలం చేసింది. గత రెండేళ్లుగా ఎగ్జామ్స్ లేకుండానే పాస్ అయిపోయారు స్టూడెంట్స్. కరోనా సమయంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులందరినీ ప్రమోట్ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు.. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. దీంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది.
ఇంటర్ బోర్డు తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు మండిపడుతున్నాయి. ఇప్పటికిప్పుడు పరీక్షల నిర్వహణ అంటే ఆశామాషీ కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం ప్రభుత్వం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించమని చెబుతూ అందరినీ ప్రమోట్ చేసినట్లు ప్రకటించిందని, ఇప్పుడు మళ్లీ ఎగ్జామ్స్ అంటే విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడమేనని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇంటర్ బోర్డు తీరును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది పేరెంట్స్ కమిటీ. పరీక్షలు రద్దు చేయాలని కోరుతున్నారు. ఈ ఉదయం 11 గంటలకు విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ నెల 25 నుంచి నవంబర్ 3 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అయితే.. పరీక్షల నిర్వహణకు తాము సహకరించబోమని ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాలు తేల్చిచెప్పేశాయి. గత రెండేళ్లుగా కాలేజీలు మూతబడటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యలను పరిష్కరించడంలో అటు ప్రభుత్వం, ఇటు ఇంటర్ బోర్డు విఫలమయ్యాయని ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలివ్వకపోవడంతో కాలేజీలు నడపడం కష్టమవుతోందని వాపోతున్నారు. ఈ సమస్యలు పరిష్కారమయ్యేవరకు ఎగ్జామ్స్‌కు సహకరించేదిలేదని హెచ్చరించాయి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు.
ఇదిలా ఉంటే.. ఈవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఇంటర్ పరీక్షల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు విద్యాశాఖ వెల్లడించింది. ఈ సారి 4 లక్షల 58 వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్టు స్పష్టం చేసింది. అయితే కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను 14 వందల నుంచి 17 వందల 50కి పెంచినట్టు చెప్పింది. ఎగ్జామ్స్ నిర్వహణకు జూనియర్ కాలేజీలు సహకరించమని చెప్పడంతో స్కూళ్లను కూడా పరీక్ష కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పరీక్షల నిర్వహణకు ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా సహకరించాలని విద్యాశాఖ కోరుతోంది.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల విషయంలో విద్యార్థులు ఎలాంటి భయానికి లోనవ్వాల్సిన అవసరం లేదని ఇంటర్ బోర్డు చెబుతోంది. ఎగ్జామ్స్ తేలికగానే ఉంటాయని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కరోనా నేపథ్యం, విద్యాబోధనలో ఇబ్బందులు, కొన్నిచోట్ల సిలబస్ పూర్తవ్వని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నట్టు చెప్పారు. బోర్డు విడుదల చేసిన స్టడీ మెటీరియల్ పరిధిలోనే ప్రశ్నలుండే వీలుంటుందన్నారు. ఇక.. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు మంచినీళ్ల సీసాలను, శానిటైజర్లను లోపలకు తెచ్చుకోవచ్చన్నారు. పరీక్షల నిర్వహణకు ముందు, తర్వాత బెంచీలు, తలుపులు, కిటికీలను శానిటైజ్ చేస్తామన్నారు. ప్రతీ విద్యార్థికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తామని, మాస్కులు ధరించిన వారిని మాత్రమే లోపలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు అధికారులు.