Warangal: సర్కారు స్కూళ్లల్లో సవాలక్ష సమస్యలు
Warangal: పాలకులు పట్టించుకోరు... అధికారులు కనికరించరు...
Warangal: విద్యాసంవత్సరం ఆరంభమైంది. సర్కారు స్కూళ్లు సవాలక్ష సమస్యలకు వేదికగా నిలిచాయి. పాలకులు పట్టించుకోరు... అధికారులు కనికరించరు.. మౌలిక వసతుల్లేవు... స్కూళ్లల్లో తిష్టవేసిన సమస్యలతో విద్యార్ధులు, ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులు, ఉపాధ్యాయురాళ్ల దీనావస్థపై హెచ్ ఎం టీవీ గ్రౌండ్ రిపోర్ట్.
పాఠశాలలు పున:ప్రారంభమైన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని పాఠశాలలను హెచ్ ఎంటీవీ బృందం సందర్శించింది. ఎక్కడ చూసినా సమస్యలే స్వాగతం పలికినా.. ప్రధానంగా మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా కనిపించింది. గ్రామాల్లో , ఏజెన్సీ ఏరియాలో ఈ పరిస్థితి ఉన్నదనుకుంటే పొరపాటే.. నగరం నడిబొడ్డున ఉన్న పాఠశాలల్లో విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతం.
ఇవన్నీ ప్రభుత్వ స్కూళ్లల్లో మరుగుదొడ్లు... శుభ్రతకు నోచుకోవు... ఒకే టాయిలెట్‌ను వందలమంది ఉపయోగించుకోవాల్సి వస్తోంది. దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. దాహంతీర్చుకోడానికి నీళ్లుండవు... మరుగుదొడ్ల శుభ్రతకు నీళ్ల కరువు. మరుగుదొడ్లు లేని స్కూళ్లే ఎక్కువగా కన్పిస్తున్నాయి. మరుగుదొడ్డి, నీళ్లు ఉంటే.. తలుపులుండవు... టాయిలెట్లు కంపు వాసన కొడుతున్నా ముక్కు మూసుకొని పోవాల్సిందే.. మావల్ల కాదనుకుంటే చెట్ల పొదలను, రోడ్డు పక్కన గోడలను టాయిలెట్లుగా మార్చుకోవాలి. ప్రభుత్వపాఠశాలల్లో ఇదీ పరిస్థితి!! ఉమ్మడి వరంగల్ జిల్లాలో సగానికి పైగా పాఠశాలల్లో టాయ్‌లెట్లు సరిగా లేవు. ఉన్నచోట నిర్వహణ లేదు. మరుగుదొడ్లు లేని పాఠశాలల్లో బాలికల కష్టాలు వాళ్ల మాటల్లోనే విందాం..
ఇక్కడ మీరు చూస్తున్న పాఠశాల హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల. ఇక్కడ పిల్లలకు ఇంటర్వెల్ వచ్చిందంటే చాలు.. తెగ టెన్షన్ మొదలవుతుంది. పాఠశాలలో ఉన్న పరిస్థితులతో విద్యార్థులు మరుగుదొడ్లకు వెళ్లేందుకు కూడా అవకాశం లేదు. మగపిల్లలు ఆరు బయటకు వెళ్లి వస్తున్నారు. ఆడపిల్లలు పరిస్థితి దయనీయంగా ఉంది. ఉన్న టాయిలెట్స్ సరిపోక.. అవికూడా శుభ్రంగా లేక అమ్మాయిలు నరకం అనుభవిస్తున్నారు. ఇది ఒక్క ఎల్కతుర్తి ప్రభుత్వ పాఠశాల పరిస్థితే కాదు. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితితో పిల్లలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హన్మకొండ జిల్లాలో డీఈవో ఆఫీసును ఆనుకునే ఉన్న సుబేదారి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకే టాయిలెట్ వాడుకోవాల్సిన దుస్థితి. బాత్ రూమ్‌లు ఉన్న పాఠశాలల్లో కూడా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. స్కూల్లో 500 మంది 600 మంది పిల్లలకు కేవలం ఒక్క బాత్ రూమ్ ఉంది. దీంతో మూత్రశాలకు వెళ్లేందుకు పిల్లలు ఊపిరి బిగబట్టి తమ వంతు ఎప్పుడు వస్తుందా అని లైన్ లో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మాటేమిటో కానీ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాలని విద్యార్థులు , ఉపాధ్యాయులు కోరుతున్నారు.
వరంగల్ జిల్లాలోని స్కూళ్లలో 60 శాతం మరుగుదొడ్లు వినియోగంలో లేవు. ఇందుకు ప్రధాన కారణం నీళ్లు, స్కావెంజర్ల సమస్యే. జిల్లాలో 4875 పాఠశాలలు ఉంటే.. వీటిలో 6380 మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి, కేవలం 2,077 మరుగుదొడ్లకు నీటి సదుపాయం ఉంది. స్వచ్ఛభారత్ అంటూ కేంద్రం, మనఊరు మనబడి అంటూ రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా... పాఠశాల విద్యార్థులు మాత్రం టాయిలెట్లు లేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
పాలకుల మాటలకు.. క్షేత్రస్థాయిలో చేతలకు పొంతనలేకుందని ప్రతిస్కూల్లో పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి.
మనఊరు.. మన బడి... పేరుతో కోట్లకు కోట్లు వెచ్చి స్కూళ్ల రూపురేఖలు మర్చే క్రమంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కనీస అవసరాలను తీర్చాలనే అభిప్రాయం సర్వత్రావ్యక్తమవుతోంది.