కరోనా వేళ వైద్యులను కాపాడుకోవడం మన బాధ్యత !

Update: 2020-07-02 05:48 GMT

ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మహమ్మారికి ఎదురొడ్డి పోరాడుతోన్న డాక్టర్స్ కరోనా బారిన పడటం కలవరపెడుతోంది. బాధితులకు చికిత్స అందించే డాక్టర్సే వ్యాధి బారిన పడితే ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ వైద్యునికి కరోనా సోకినా నిమ్స్ లో ప్రత్యేక చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు డాక్టర్లు.

ఓ వైపు సామాన్యులకు కరోనా సోకడంతో భయపడుతోన్న జనాలు డాక్టర్లు కూడా మహమ్మారి బారిన పడుతుండటంతో బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని నిమ్స్ లో 72, గాంధీలో 36, కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో 32, మలక్ పేట ఏరియా హాస్పిటల్ లో 14, పేట్ల బూర్జులో 36, ఉస్మానియా హాస్పిటల్లో 14, ఉస్మానియా మెడికల్ కాలేజ్ పరిధిలో 100కు పైగా మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్లు గణాంకాలు చెప్తున్నాయి.

కరోనా బారిన పడటంతో ఆందోళనకు గురవుతున్న నిమ్స్ డాక్టర్లు పీపీఈ కిట్లను అందజేయాలని కోరుతున్నారు. అటు సిబ్బంది కొరత ఉండటంతో వైద్య నియామకాలను వెంటనే చేపట్టాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ఫ్రంట్ వారియర్స్ గా కరోనాతో ప్రాణాలకు తెగించి పోరాడుతోన్న తమకు ప్రభుత్వం ప్రత్యేక చికిత్స ఏర్పాట్లను చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఏదేమైనా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా బాధితులకు చికిత్స అందజేస్తున్న డాక్టర్లను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది. డాక్టర్లు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యపడుతుందనే నిజాన్ని తక్షణమే ప్రభుత్వం గ్రహించి వారి అవసరాలను తీర్చాలని కోరుకుందాం.


Full View


Tags:    

Similar News