HYDRA Latest Report: హైడ్రా కొత్త నివేదిక.. మొత్తం ఎన్ని కూల్చేశారు.. ఎన్ని ఎకరాలు లెక్కతేల్చారంటే..

Update: 2024-09-11 12:05 GMT

HYDRA Latest Report: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూల్చివేతలపై రెండోసారి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 262 అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు రంగనాథ్ తెలిపారు. 23 ప్రాంతాలలో అక్రమ కట్టడాల కూల్చివేత అనంతరం మొత్తం 111.72 ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుండి స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. అందులో అత్యధికంగా అమీన్ పూర్ చెరువులో 24 అక్రమనిర్మాణాలు తొలగించి 51 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు రంగనాథ్ పేర్కొన్నారు. ఆ తరువాతి స్థానంలో ఇటీవలే మాదాపూర్ లోని సున్నం చెరువులో 42 అక్రమ కట్టడాలు కూల్చి 10 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

దుండిగల్ మునిసిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులో 13 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ తమ నివేదికలో పేర్కొన్నారు. ఇక్కడ నూతనంగా నిర్మించిన విల్లాలను గత ఆదివారం హైడ్రా కూల్చేసిన సంగతి తెలిసిందే. 

సున్నం చెరువులో కూల్చివేతల సందర్భంగా అక్కడి స్థానికుల నుండి హైడ్రాకు వ్యతిరేకంగా తిరుగుబాటు కనిపించింది. ముగ్గురు వ్యక్తులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటాం అని ధర్నాకు దిగారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన హైడ్రా.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైడ్రా ఫిర్యాదుతో సున్నం చెరువు ఘటనలో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News