HYDRA: హైడ్రా కూల్చివేతలకు బ్రేక్

HYDRA: HMDA , GHMC పరిధిల్లోని చెరువుల సమగ్ర సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Update: 2024-10-09 05:13 GMT

HYDRA: హైడ్రా కూల్చివేతలకు బ్రేక్

HYDRA: HMDA , GHMC పరిధిల్లోని చెరువుల సమగ్ర సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 నెలల్లో ఈ సర్వే పూర్తి చేయాలని ఇరిగేషన్, రెవిన్యూ శాఖలను ఆదేశించారు. ఈ సర్వే పూర్తయ్యే వరకు అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ పడనుంది. కచ్చితమైన సమాచారం ఆధారంగానే ఇక నుంచి రంగంలోకి దిగనుంది హైడ్రా.

చెరువుల ఎఫ్ టి ఎఫ్ ల నిర్ధారణ ఎందుకు?

హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల విస్తీర్ణం, ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎఫ్ టి ఎల్ నిర్దారించడానికి చట్టబద్దమైన నిబంధనలున్నాయా, లేదంటే ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా చేస్తారా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దుర్గం చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిపై దాఖలైన పిటిషన్ పై విచారణ సమయంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని అంశాలను లేవనెత్తింది. చెరువుల ఎఫ్ టి ఎల్ నిర్ధారించకుండానే అక్రమ నిర్మాణాలుగా ఎలా నిర్ధారిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రా ఏర్పాటును అభినందిస్తూనే హైడ్రా పనితీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చెరువుల ఎఫ్ టి ఎల్ లను నిర్ధారించాలని నిర్ణయం తీసుకుంది.

ఎన్ని చెరువులు ఆక్రమణకు గురయ్యాయంటే

జీహెచ్ఎంసీ, హెచ్ ఎం డి ఏ పరిధిలో 2014 నుంచి 2023 వరకు చెరువుల ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం సమాచారం సేకరించింది. నేషనల్ రిమోట్ ఫెన్సింగ్ సెంటర్ అంటే NRSC ద్వారా శాటిలైట్ చిత్రాలను సేకరించారు. హైద్రాబాద్ లో మొత్తం 920 చెరువులున్నాయి. తెలంగాణ ఏర్పడే నాటికి 225 చెరువులు పూర్తిగా, 196 చెరువులు పాక్షికంగా ఆక్రమణలకు గురయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 44 చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 695 చెరువుల్లో తెలంగాణ ఏర్పడే నాటికి 196 పాక్షికంగా అన్యాక్రాంతమయ్యాయి. 2014 తర్వాత 171 చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఇవన్నీ ఎఫ్ టి ఎల్ పరిధిలోనివే. బఫర్ జోన్ కూడా పరిగణనలోకి తీసుకొంటే ఆక్రమణలు ఇంకా ఎక్కువ ఉంటాయని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.

హైడ్రా ఏం చేస్తోంది?

భవిష్యత్తులో కూల్చివేతల విషయంలో న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా ఉండేలా హైడ్రా జాగ్రత్తలు తీసుకుంటుంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ రిపోర్ట్ ఆధారంగా హైడ్రా అధికారులు రిపోర్టులు తయారు చేస్తున్నారు. ఇప్పటివరకు అందిన ఫిర్యాదుల ఆధారంగా క్షేత్రస్థాయిలో హైడ్రా అధికారులు పర్యటించి నివేదికలు సిద్దం చేస్తున్నారు. కూల్చివేతల సమయంలో ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఆధారాలను రెడీ చేసుకుంటున్నారు. చెరువుల ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లు నిర్ణయించిన తర్వాతే హైడ్రా యాక్షన్ లోకి దిగనుంది.

ఆర్డినెన్స్ తో హైడ్రాకు చట్టబద్దత

హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు అక్టోబర్ 05న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఆర్డినెన్స్ తో హైడ్రా చేసే కార్యకలాపాలకు చట్టబద్దత లభించింది. హైడ్రా చట్టబద్ధతపై ఇటీవల పదే పదే హైకోర్టు ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ ను తెచ్చింది. జీహెచ్ఎంసీ 1955 చట్టాన్ని సవరించింది. నగరంలోని జలాశయాలు, ఇతర ఆస్తులను కాపాడేందుకు అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెడుతూ జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374 సెక్షన్ బిని చేర్చారు. ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ ఏడాది జులై 19న హైడ్రా ఏర్పాటు చేస్తూ 99 జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రంగారెడ్డి, హైద్రాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాలను దీని పరిధిలో చేర్చారు.

ఆ కట్టడాల మాటేంటి?

సచివాలయం, బాపుఘాట్ సహా హైద్రాబాద్ లో అనేక ప్రముఖ కట్టడాలు ఎఫ్ టి ఎల్ పరిధిలోనే ఉన్నాయని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. సచివాలయం కూడా ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉన్నప్పుడు లేని ఇబ్బంది పేదల ఇళ్లు ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉంటే ఎందుకని ఆయన ప్రశ్నించారు. పేదల సంక్షేమం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పేదల జోలికి రావద్దని ఆయన కాంగ్రెస్ కు సూచించారు. నిజామాబాద్ లో జరిగిన సభలో అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కూల్చివేతలను ప్రశ్నించారు.

ఆక్రమణలు కొనసాగించాలా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆక్రమణలకు గురైన చెరువులు, నీటి వనరులను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైడ్రా కార్యాలయం కూడా ఎఫ్ టి ఎల్ పరిధిలోనే ఉంది. దాన్ని కూడా కూల్చాలని విపక్షాలు ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయి.హైద్రాబాద్ అంటే చెరువుల నగరం. అలాంటి నగరంలో చెరువులు ఆక్రమణకు గురి కాకుండా కాపాడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో అనేక చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి.ఇలా ఆక్రమణలు జరగకుండా అడ్డుకోవాలా... కొనసాగించాలా ఆలోచించాలని భట్టి విక్రమార్క ప్రజలను కోరారు. ఆక్రమణలకు గురికాకుండా కాపాడితే హైద్రాబాద్ పౌరులు భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా జీవిస్తారని ఆయన చెప్పారు.

వర్షాకాలం వస్తే హైద్రాబాద్ లో రోడ్లపై నీరు నిలిచి గంటల తరబడి ట్రాఫిక్ జాం అవుతోంది. గొలుసుకట్టు చెరువులు ఆక్రమణకు గురికావడంతో ఈ పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం భావిస్తోంది. చెరువుల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ప్రభుత్వం తలపెట్టింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ముందుకు సాగుతోందని ప్రభుత్వం తెలిపింది.

Tags:    

Similar News