Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
Heavy Rains in Hyderabad: *వర్షానికి చిగురుటాకులా వణికిన భాగ్యనగరం *వర్షం దంచికొట్టడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
Heavy Rains in Hyderabad: మరోసారి హైదరాబాద్ ఉలిక్కిపడింది. ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షానికి భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోయింది. మేఘానికి చిల్లుపడిందా అన్నట్టుగా కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ వాగులను తలపించాయి. వర్షం దంచికొట్టడంతో హైదరాబాదీలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మరోవైపు వరద నీటిలో చిక్కుకుని పలువురు ప్రమాదానికి గురయ్యారు. ఇక ఎక్కడ మ్యాన్‌హోల్ ఉందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లకు చేరుకున్నారు.
పనామా, చింతల్‌కుంట చౌరస్తాల్లో మెకాలిలోతు నీరు నిలిచింది. కాగా.. చింతల కుంట వద్ద నాలాలో గల్లంతైన వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. నాలాలో పడిపోయిన వ్యక్తి కర్మన్‌ఘాట్‌కు చెందిన జగదీష్‌గా గుర్తించారు. ప్రస్తుతం జగదీష్ సురక్షితంగా ఉన్నట్టు అతని సోదరుడు తెలిపారు. నాలాలో పడిన వెంటనే తాడు సాయంతో ప్రమాదం నుంచి బయటపడినట్టు చెప్పారు. అటు డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్దంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు.
రాగల మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్యదిశగా ప్రయాణించి తదుపరి నాలుగు రోజుల్లో ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.