ప్రోటోకాల్ పేరుతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల రుబాబు.. గంటనుంచి రెండు అంబులెన్సులకు దారివ్వని ఖాకీలు
Hyderabad Traffic Police: హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్ దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
Hyderabad Traffic Police: హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్ దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ ట్రాఫిక్‌లో రెండు అంబులెన్స్‌లు దాదాపు గంటకు పైగా చిక్కుకున్నాయి. ఎంత సేపటికీ ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో అంబులెన్స్ సిబ్బంది ట్రాఫిక్ కానిస్టేబుల్ వద్దకు వెళ్లి అంబులెన్స్‌లో పేషెంట్ పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే దారివ్వాలని కోరారు. అయితే దానికి ట్రాఫిక్ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. దీంతో తప్పని పరిస్థితుల్లో అంబులెన్స్ సిబ్బందే రూట్‌ను క్లియర్ చేసుకొని వేరే మార్గం గుండా అంబులెన్స్‌ను తరలించారు. ట్రాఫిక్ పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీజీపీ ఆ దారిలో వెళ్తున్నారనే కారణంతో ట్రాఫిక్ నిలిపివేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గ్రీన్ ఛాలెంజ్ పేరుతో అంబులెన్స్, మెట్రో రైళ్లల్లో నిమిషాల్లో వివిధ ప్రాంతాల నుంచి గుండె, ఇతర అవయవాల తరలింపు చేపడుతున్న సమయంలో అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. మినిష్టర్ కాన్వాయ్‌ను కొన్ని నిమిషాలు ఆపి, అంబులెన్స్‌కు దారిస్తే ఏమైనా నష్టం జరుగుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న అధికారులే వాటిని పట్టించుకోవడంలేదంటూ మండిపడుతున్నారు.