కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో మరో వ్యక్తి సూసైడ్

Update: 2020-11-08 05:31 GMT

తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు కేసులో మరో వ్యక్తి సూసైడ్‌ చేసుకున్నాడు. కుషాయిగూడలోని వాసవి శివనగర్‌ కాలనీలో చెట్టుకు ఉరేసుకుని నిందితుడు ధర్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భూమి అక్రమ మ్యుటేషన్ ఆరోపణతో ధర్మారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో 33 రోజుల పాటు జైలు జీవితం గడిపాడు. ఇటీవలే జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన ధర్మారెడ్డి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఆగస్టు 14న కోటి 10 లక్షల నగదు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు. కీసర మండలం రాంపల్లి దాయర గ్రామంలోని ఓ భూ వివాద పరిష్కారానికి నాగరాజు 2 కోట్లు లంచం డిమాండ్‌ చేశారు. అందులో భాగంగా కోటి 10 లక్షల నగదు తీసుకుంటూ పట్టుబడటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో మిగతా నిందితులతో కలిపి నాగరాజును ఏసీబీ పలుమార్లు కస్టడీకి తీసుకుని విచారించింది. నకిలీ పాసు పుస్తకాల జారీ విషయంలో నాగరాజుపై ప్రశ్నల వర్షం కురిపించింది. కందాడి ధర్మారెడ్డి, ఇతరులకు కలిపి దాదాపు 24 ఎకరాల భూమికి అక్రమ పద్ధతిలో పాసు పుస్తకాలు ఎలా జారీ చేశారని ప్రశ్నించారు. ఇందుకు ఎవరు సహకరించారని దీని వెనక ఎంత డబ్బులు చేతులు మారిందని అడిగారు.

ఏసీబీ కస్టడీ నుంచి వచ్చిన తర్వాత నాగరాజు తీవ్ర మనస్తాపానికి గురై చంచల్‌గూడ జైలులో బలవన్మరణానికి పాల్పడ్డారు. మంజీరా బ్యారక్‌లో కిటికీకి తువ్వాలుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రిమాండ్‌ ఖైదీగా ఉన్న నాగరాజు ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించింది.

Tags:    

Similar News