Ganesh Mandap: గణేష్ నవరాత్రులకు హైదరాబాద్‌ సిద్ధం.. నిర్వాహాకులకు పోలీసుల కీలక సూచనలు..!

గణేష్ మండపాల వద్ద 2 స్పీకర్ బాక్సులకు మించి ఉపయోగించరాదని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.

Update: 2024-09-06 07:46 GMT

Ganesh Mandap: గణేష్ నవరాత్రులకు హైదరాబాద్‌ సిద్ధం.. నిర్వాహాకులకు పోలీసుల కీలక సూచనలు..!

Ganesh Mandap: గణేష్ నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్‌ సిద్ధమవుతోంది. అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించేందుకు మండపాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. రేపటి నుంచి 17వ తేదీ వరకు గణేష్ చతుర్థి జరగనుంది. ఈ నేపథ్యంలోనే గణేష్ మండపాల నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు.

హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్, భారతీయ నాగరిక్ సురక్ష సంమిత ప్రకారం గణేష్ మండపాల కోసం నిర్వాహకులందరూ ముందస్తు పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. గణేష్ మండపాలు ఏర్పాటు సమయంలో అన్ని జాగ్రత్తలు, సూచనలు పాటిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. పోలీసుల విభాగం అనుమతి తీసుకుని గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని స్పష్టం చేశారు.

ఇక మండపాలు ఏర్పాటు చేసేందుకు ఎంచుకున్న ప్రభుత్వ, ప్రైవేట్ స్థలానికి సంబంధించి యజమానుల నుంచి నో అబ్జెక్షన్ లెటర్ తప్పనసరిగా తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. సెల్లార్లు, కాంప్లెక్సుల్లో విగ్రహాల ఊరేగింపులకు పోలీసుల అనుమతి కచ్చితంగా తీసుకోవాలని సూచించారు.

ఇక విగ్రహ ప్రతిష్టాపనలు, నిమజ్జన ఊరేగింపులు కోసం నిర్వాహకులు తప్పనిసరిగా సమాచార పత్రాన్ని సమర్పించాలని సూచించారు. ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ హైదరాబాద్ సిటీ పోలీస్ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపారు. ఇక మండపంలో విద్యుత్ కోసం సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు.

గణేష్ మండపాల వద్ద 2 స్పీకర్ బాక్సులకు మించి ఉపయోగించరాదని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ స్పీకర్ బాక్సుల వినియోగంపై నిషేధం ఉందని వాటిని తప్పనిసరిగా పాటించాలని కోరారు. మండపాల వద్ద అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలతో పాటు అగ్ని ప్రమాదాలు నివారించే పరికరాలను అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు.

Ganesh Chaturthi 2024: ఈ చవితికి ఇలా విషెస్‌ చెప్పండి.. బెస్ట్‌ గ్రీటింగ్స్‌..!

Tags:    

Similar News