హైదరాబాద్‌లో వరద ప్రాంతాల్లో పోలీసులు ప్రాణాలకు తెగించి సహాయం అందిస్తున్నారు. తమ కుటుంబాలను సైతం పక్కన పెట్టి 24 గంటలూ ఫీల్డ్ లోనే ఉండి వరద బాధితులను ఆదుకుంటున్నారు. బస్తీలు, కాలనీల్లో నీట మునిగిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం వారికి ఆహార, వైద్య సదుపాయాలు అందించడంలో నిమగ్నమవుతున్నారు. వారి కుటుంబాలు కూడా వరద నీటిలోనే ఉన్నా కుటుంబం కన్నా డ్యూటీ మిన్న అన్న రీతిలో కష్టపడుతున్నారు. ముప్పును ముందే గ్రహించిన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు అప్రమత్తం అయ్యారు. తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. రెస్క్యూ టీంను రంగంలోకి దింపారు.
హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ నాలుగు రోజులుగా కమిషనరేట్ ఆఫీస్‌లోనే ఉండిపోయారు. అవసరమైన ప్రాంతాలకు రెస్క్యూ టీంలను పంపించడం, ఎక్కడి కక్కడ పరిస్థితిని సమీక్షించడం లో మునిగిపోయారు. భారీ వర్షం మొదలైన నాటినుంచి ఆయన ఇంటికే వెళ్లలేదు, ఆఫీస్ లోనే ఉంటూ తన టీంను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సీపీ అంజనీకుమార్ ఇంటికి సైతం వరద ముప్పు తప్పలేదు. తాముంటున్న ఇంటికి సైతం వరద నీరు వచ్చినా ఆయన మాత్రం డ్యూటీ ఫస్ట్ అని ఆఫీస్ లోనే ఉన్నారు. వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా రోడ్లకు అడ్డంగా ఉన్నచెట్లను తొలగించారు. నగర వాసులకు ఇబ్బంది కలగకుండా రాత్రి పగలు కష్టపడుతున్నారు.
సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ సైతం నడుంలోతు నీళ్లలోకి దిగి పాతబస్తీలో అనేక మంది వృద్ధులను, మహిళలను తరలించడంలో సాయపడ్డారు. ఇటు రాచకొండ సీపీ మహేష్ భగవత్ కూడా వరద సహాయ చర్యలపై రంగంలోకి దిగారు. వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడుతున్నాయి. నీట మునిగిన కాలనీల్లో పర్యటిస్తూ సహాయ చర్యలు చేపడుతున్నారు.