సరిగా చదువుకోవడం లేదంటూ తండ్రి మద్యం మత్తులో కొడుకుపై టర్పెంటాయిల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాలుడు చరణ్ చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డాడు. కాలిన గాయాలతో మూడు రోజుల పాటు హాస్పిటల్‌లో ప్రాణాలతో కొట్టుమిట్టాడిన చిన్నారి సిక్రిందాబాద్ గాంధీ హాస్పిటల్‌లో కన్నుమూశాడు. ఈ సంఘటన ఈ నెల 18న కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలు తెరవకపోవడంతో చరణ్ ఆన్‌లైన్ ద్వారా క్లాస్‌లు వింటున్నాడు. గత ఆదివారం రాత్రి 9గంటల ప్రాంతంలో బాలుడి తండ్రి బాలు మద్యం సేవించి ఇంటికి రాగా కొడుకు చరణ్ టీవీ చూస్తూ కనిపించాడు. చదువుకోకుండా టీవీ చూస్తుండడంతో ఆగ్రహానికి గురై చదువుకోవడం లేదని చరణ్‌ను విచక్షణా రహితంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న టర్పెంటాయిల్‌ను అతడిపై పోసి నిప్పంటించాడు. భార్య, బిడ్డలు అడ్డుకున్నా ఆగకుండా ఘాతుకానికి పాల్పడ్డాడు. మంటలకు తాళలేక చరణ్ కేకలు పెడుతూ బయటకు పరుగులు తీస్తూ పాఠశాల వెనుక ఉన్న గుంతలో పడిపోయాడు. గమనించిన స్థానికులు చరణ్‌ను గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో చరణ్ మృత్యువాతపడ్డాడు.