Night Curfew Effect: హైద్రాబాద్ లో రాత్రి 7 గంటల వరకే సిటీ బస్సులు

Night Curfew Effect: రాత్రి పూట ప్రయాణించేవారు విధిగా టికెట్ చూపించాలి.

Update: 2021-04-21 05:31 GMT

Night Curfew Effect on TS RTC

Night Curfew Effect: సెకండ్ వేవ్ ముంచుకొస్తోంది. ప్రజలను ముంచెత్తుతోంది. లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కోవిడ్ బారిన పడి రోజూ వందల మంది చనిపోతున్నారు. గత ఆదివారం నుంచి నిమిషానికి ఒకరు చొప్పున చనిపోతున్నారు. గంటకు 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించడంతో టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ఇకపై రాత్రి ఏడు గంటలకే సిటీ బస్ సర్వీసుల చివరి ట్రిప్‌ను ముగించాలని నిర్ణయించింది. రాత్రి 9 గంటలకల్లా ట్రిప్‌లు ముగించుకుని బస్సులు డిపోలకు చేరే ఉద్దేశంతో ట్రిప్‌లను కుదించింది.

అలాగే, తెల్లవారుజామున నాలుగు గంటలకు మొదలయ్యే తొలి ట్రిప్‌లను ఆరు గంటలకు మార్చింది. అయితే, జిల్లా, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అవి యథాతథంగానే నడుస్తాయని అధికారులు తెలిపారు. ఒకవేళ తొమ్మిది గంటల సమయంలో ప్రయాణికులు బస్టాండ్లలో దిగితే కనుక ఇంటికి వెళ్లేందుకు ఆటోలు, క్యాబ్‌లు వినియోగించుకోవచ్చు. అయితే, ఇందుకు విధిగా టికెట్ చూపించాల్సి ఉంటుంది.

నైట్ కర్ఫ్యూ ఉన్నా దూరప్రాంతాలకు వెళ్లాల్సిన వారు టికెట్‌ను చూపించి బస్టాండ్లకు చేరుకోవచ్చు. మరోవైపు, రాత్రిపూట బయలుదేరే బస్సులు తగినంతమంది ప్రయాణికులు ఉంటేనే బయలుదేరుతాయని, లేదంటే రద్దవుతాయని అధికారులు తెలిపారు. ఈ విషయంలో ప్రయాణికులకు ముందే సమాచారం ఇస్తామని, రద్దయితే టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తామని వివరించారు. కాగా, కర్ఫ్యూతో నిమిత్తం లేకుండా రైళ్లు యథావిధిగా నడవనున్నాయి.

మరో వైపు తెలంగాణ వ్యాప్తంగా థియేటర్ల బంద్‌కు థియేటర్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతుండటంతో ప్రభుత్వం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ప్యూ విధించింది. రెండు షోలు వేసుకునే వీలు ఉన్నా ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇదివరికే పెద్ద స్టార్స్ సినిమాలన్నీ వాయిదా పడినప్పటికీ సినిమాలు రిలీజ్ చేయడానికి చిన్న నిర్మాతలు ఆసక్తి చూపారు. కానీ తెలంగాణలో కర్ప్యూ కారణంగా ఈ నెల 23న రిలీజ్ కావాల్సిన తెలంగాణ దేవుడు, ఇష్క్, శుక్ర సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో థియేటర్స్ ఓనర్స్ అసోషియేషన్ వకీల్‌సాబ్ చిత్ర డిస్ట్రిబ్యూటర్స్‌తో ఉన్న అగ్రిమెంట్ కారణంగా ఆ సినిమా ప్రదర్శించే థియేటర్లు మినహా అన్ని థియేటర్లు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Tags:    

Similar News