పట్నం పల్లెకు పయనమైంది. నగరవాసులు పెద్దసంఖ్యలో సొంతూళ్లకు తరలివెళ్లారు. దీంతో మహానగరం నెమ్మదిగా ఖాళీ అవుతోంది. ఆర్టీసీ బస్టాండ్‌లు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. ఇన్నాళ్లకు మళ్లీ బస్సులు కిక్కిరిసి బయలుదేరాయి.
ఆర్టీసీ బస్సుల్లో సాధారణ చార్జీలపైన 50 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌లో అయితే రెట్టింపు చార్జీలు వేస్తున్నారు. ఇటు రైళ్లల్లో అప్పటికప్పుడు టికెట్ తీసుకునే వెసలుబాటు లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు కరోనా భయంతో చాలా మంది సొంత వాహనాల్లోనే సొంతూళ్లకు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేవారు ఎక్కువ శాతం సొంత కార్లు, క్యాబ్‌లను ఆశ్రయించారు.
హైదరాబాద్ నుంచి సుమారు 15 లక్షల మంది నగర వాసులు సొంతూళ్లకు తరలి వెళ్లినట్లు అంచనా. అయితే ప్రస్తుతం ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రాం హోం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చాలామంది ఇప్పటికే సొంతూళ్లల్లోనే ఉండిపోయారు. మరోవైపు కరోనా సమయంలో ఊళ్లకు వెళ్లిన చిరువ్యాపారులు, చిన్న చిన్న పనులు చేసుకునే వారు చాలామంది అక్కడే ఉండిపోయారు. ఇలా అప్పటికే సిటీ సగం ఖాళీగా అయ్యింది. ఇప్పుడు మిగిలిన వారు కూడా సొంతూళ్లకు పయనమవుతున్నారు.